ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి జాతరను మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు రద్దు చేశారు. ఎంతో వైభవంగా జరిగే ఈ జాతరని రద్దు చేయడం గత 50 ఏళ్లలో ఇది రెండోసారి.
మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్లో 1815 సంవత్సరం నుంచి 1905 మధ్యకాలంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజా సోమ భూపాలుడు.. స్వామివారి జాతరని ప్రారంభించారు. తర్వాత 1966 లో ఏర్పాటైన రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ.. కురుమూర్తి స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతను చూస్తోంది.
మొదటి సారి నీటి కరవుతో జాతర రద్దు
1970లో జిల్లాలో తీవ్ర కరవు నెలకొనడంతో తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది. జాతరలో నిర్వహించే అతి పెద్ద పశువుల సంతకు వచ్చే పశువులకు తాగునీటిని అందించే చెరువు సైతం ఎండిపోయింది. ఆ కారణంగా అప్పట్లో దేవాదాయశాఖ అధికారులు జాతరతో పాటు పశువుల సంతనీ రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు కరోనా ప్రభావంతో ఈ ఏడాది జాతరను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో జాతరపై ఆధారపడే వ్యాపార కుటుంబాల జీవనంపై తీవ్ర ప్రభావం పడనుంది.
కురుమూర్తి జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. శీతాకాలంలో వచ్చే జాతర కావడంతో.. ఈ కాలంలో కరోనా వైరస్ ప్రభావం మరింత శక్తివంతంగా పని చేస్తుందని భావించిన అధికారులు జాతరని రద్దు చేశారు. ఈ మేరకు స్వామివారి ఉత్సవాలు అర్చకుల సమక్షంలో నిరాడంబరంగా జరగనున్నాయి.
జీవనంపై ప్రభావం
అధికారుల నిర్ణయంతో భక్తులకు, వ్యాపారులకు నిరాశ ఎదురైంది. కరోనా తీవ్రత దృష్ట్యా వేలాదిగా తరలి వచ్చే జాతరను రద్దు చేయడమే మేలని మరికొందరు భావిస్తున్నారు.
ఇదే కాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉగాది వరకు నిర్వహించే పలు ఉత్సవాలపై ప్రభావం చూపనుంది. ఫలితంగా దేవాదాయశాఖ ఆదాయం, వ్యాపారుల జీవనంపై ఆర్థిక భారం పడనుంది.
ఇదీ చదవండి: పోలవరంపై నేడు హైదరాబాద్లో కీలక భేటీ..