మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో.."పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్యం, మన మహబూబ్ నగర్ " పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలను ఆరోగ్యంగా తీర్చిదిద్దడంలో గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో పని చేసే విధానాలపై గ్రామీణ కార్యదర్శులు అంగన్వాడి కార్యకర్తలతో పాటుగా.. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఆరోగ్య గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు..
గ్రామాలు ఆరోగ్యంగా ఉండేందుకు మండల ప్రత్యేక అధికారి శంకరాచారి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మొక్కలు నాటాలని కోరారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. బహిరంగ ప్రదేశాలలో బహిర్భుమికి వెళ్లకుండా మరుగుదొడ్ల వినియోగించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా డంపింగ్ యార్డ్లకు తరలించి రీ సైక్లింగ్ చేయాలన్నారు. దీంతో పాటుగా సేకరించిన చెత్తను పోగుచేసి నిప్పు అంటించడం వలన జరిగే దుష్పరిణామాలను సిబ్బందికి వివరించారు.
బీపీ, షుగర్, తగ్గుముఖం పట్టడానికి ఆ నీరే కారణం: నిపుణులు
ఆర్ ఓ ప్లాంట్ ద్వారా.. ఎలాంటి లవణాలు మినరల్స్ లేని నీరు తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలిపారు. ఈ మధ్య గ్రామీణా ప్రాంతాల్లో బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అందుకు కారణం అన్ని రకాల మినరల్స్ ఉన్న మిషన్ భగీరథ నీటిని తాగడమే అని వెల్లడించారు.
ప్రచార వాహనాలకు పచ్చ జెండా..
స్థానిక ఎంపీపీ రమాదేవి అధికారులతో కలిసి.. ప్రభుత్వ పథకాల ప్రచార వాహనాలకు పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ రూపేందర్ రెడ్డి, ఎం పి ఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్ బి ఎం కోఆర్డినేటర్ పవన్ కుమార్, రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షులు కొండరెడ్డి వివిధ శాఖల అధికారులు, గ్రామాల కార్యదర్శులు అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
''ప్రభుత్వ పథకాలతో ఆరోగ్యకరమైన గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ సిబ్బంది గ్రామీణ వాసులకు అవగాహన కల్పించాలి ''
-యాదయ్య , మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సీఈవో
ఇదీ చదవండి:ఆరేళ్లలో టీఎస్‌పీఎస్సీపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు: సీఎస్