మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి జాతర ఏటా దీపావళి మొదలుకొని నెలరోజులపాటు కొనసాగుతుంది. కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం కురుమూర్తి స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కొందరైతే జాతర సమయంలో మాత్రమే దొరికే కాల్చిన మాంసాన్ని ఆస్వాదించేందుకే వస్తుంటారు.
జాతరకు వచ్చి మాంసాన్ని రుచిచూడకుండా వెళ్లరు. వాస్తవానికి జాతరకు, కాల్చిన మాంసానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఐదారు దశాబ్దాలుగా జాతరకు కాస్త దూరంలో కాల్చిన మాంసాన్ని అమ్మడం అలవాటుగా వస్తోంది. కురుమూర్తి జాతరలో కాల్చిన మాంసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందంటే.. హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కేవలం దాన్ని తినేందుకు వచ్చేవాళ్లే వేలల్లో ఉంటారు.
కాల్చిన గొర్రె, మేక, కోడి మాంసం అంతటా దొరుకుతుంది. అన్నిరోజుల్లోనూ లభ్యమవుతుంది. కానీ, ఇక్కడ.. ఈ సమయంలో దొరికే కాల్చిన మాంసం రుచి మాత్రం అదరహో అనిపిస్తుంది. ప్రత్యేకమైన మసాలాలు దట్టించి మాంసాన్ని నిప్పులపై కాలుస్తారు. 45రకాల ప్రత్యేక దినుసులతో జాతరకు 2నెలలకు ముందే మసాలాలు తయారు చేసి పెట్టుకుంటారు. వాటి తయారు రహస్యం మాత్రం స్థానికులకే తెలుసు. ఆ మసాలాలే చికెన్, మటన్ చీకుల అసలు ప్రత్యేకత. ఇక లేత, వైద్యులతో సురక్షితమైనదని నిర్ధారించిన మాంసాన్నే వాటికోసం వాడుతారు.
''కురుమూర్తి జాతరలో ముఖ్యంగా మటన్ దొరుకుతోంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదే. దీన్ని మేం పర్యవేక్షించాం. సాధ్యమైనంత వరకు క్లీన్ నెస్ ఉండేలా చూసుకుంటున్నాం.'' - డా. మధుసూదన్, జిల్లా పశు వైద్యాధికారి మహబూబ్ నగర్
జాతర మొదలైందంటే కాల్చిన మాంసం అమ్మే దుకాణాలు వెలుస్తాయి. మేక, గొర్రె మాంసాన్ని కిలో 600 నుంచి 700 రూపాయల చొప్పున, చికెన్ 300 నుంచి 350 రుపాయల వరకూ అమ్ముతారు. కేవలం కాల్చిన మాంసం విక్రయాల ద్వారా నిత్యం లక్షల్లో వ్యాపారం సాగుతుంది.
''మటన్, చికెన్ కోసం రోజూ చాలా మంది వస్తారు. 80 దుకాణాలు ఉంటాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి మాంసం తింటారు. ప్రతి సంవత్సరం ఇలా మేం వచ్చి తింటాం. టెస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దర్శనం అయ్యాక వచ్చి తింటాం. మాకు చాలా నచ్చింది. మటన్, చికెన్, కిమా అన్ని దొరుకుతాయి.'' - మాంసం ప్రియులు
ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు సాగితే జాతర 30రోజుల పాటు ఉంటుంది. కాల్చిన మాంసం విక్రయాలు మాత్రం 2నెలల వరకూ నిరాటంకంగా సాగుతాయి. మీరూ రుచి చూడాలనుకుంటే కురుమూర్తి జాతరకు వెళ్లాల్సిందే.
ఇవీ చూడండి: