పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ఓటేస్తే అల్లకల్లోలం తప్ప ఏమీ చేయరని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ పట్టణంలో వివిధ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
వారికి అవకాశం ఇవ్వొద్దు...
70ఏళ్లు పరిపాలించి రాష్ట్రాన్ని దేశాన్ని అధోగతి పాలు చేసినా వాళ్లు తెరాసని ఎలా విమర్శిస్తారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి దేశంలోనే అత్యధిక వరి దిగుబడి చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీర్చిదిద్దామన్నారు. ప్రత్యర్ధి పార్టీలకు సీట్లిస్తే అల్లకల్లోలం తప్ప ఇంకేమి చేయరని వ్యాఖ్యానించారు. చిన్న,మధ్య తరహా విద్యాసంస్థలపై శాఖా పరమైన దాడుల్ని నిలిపి వేశామని గుర్తు చేశారు. అరేళ్లలో ఒక్క మత కలహం చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. కులమతాల భావోద్వేగాలతో పబ్బం గడపాలనే మూకలకు అవకాశం ఇవ్వొద్దని కోరారు.
విధిగా ఓటింగ్లో పాల్గొనండి...
పాలమూరుకు జలహారంలా పాలమూరు- రంగారెడ్డి కాలువలను పట్టణం నుంచి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నెల రోజుల్లో 30వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులిచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. ఉద్యోగులందరూ విధిగా ఓటింగ్లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి సురభి వాణీదేవి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.