కొవిడ్ బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఎస్వీఎస్ దవాఖాన కొవిడ్ వార్డును సందర్శించి వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులతో నేరుగా మాట్లాడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఐసీయూను సందర్శించి అందులో ఉన్న రోగులతో మాట్లాడారు.
అనంతరం ఫార్మసీలో అందుబాటులో ఉన్న రెమ్డెసివిర్, ఇతర కొవిడ్ మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని.. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రులకు రాకుండా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా మందులు, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసి.. బీదవారికి తక్కువ ధరకు చికిత్స అందించేందుకు మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. లాక్డౌన్ విధించిన తర్వాత కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క బ్లాక్ ఫంగస్ కేసు కూడా నమోదు కాలేదని వివరించారు.
ఇదీ చదవండి: 'మొల్నుపిరావిర్ విజయవంతమైతే కరోనా కట్టడిలో అత్యుత్తమ ఫలితాలు'