రాష్ట్రంలో వైరస్ నియంత్రణకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించినట్లు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరోనా దృష్ట్యా మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రాను రాను కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతోందని... అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్కు ధరించటమే కాక.. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. జిల్లాలోని మండల, గ్రామ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రజా ప్రతినిధులు ప్రజల ఆరోగ్య సమస్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నారు. ఎవరికైనా లక్షణాలతో ఉన్నట్లనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలని మంత్రి సూచించారు. కొవిడ్ కోసం ప్రత్యేకించి 3 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు.
అవగాహన కల్పించండి:
ప్రజలకు కరోనా బారిన పడకుండా జడ్పీటీసీ, ఎంపీపీలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రులలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా వైద్యారోగ్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతేడాదిలాగే కూలీలు ఇతర ప్రాంతాలనుంచి జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున బియ్యం పంపిణీ విషయంలో ఆలోచించాలని కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీలో చొరవ తీసుకోవాలని కలెక్టర్ తో కోరారు.
వరిధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి:
వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష సందర్భంగా రైతులందరికీ రుణాలు వచ్చేలా చూడాలని, ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. విద్యుత్ అంతరాయం పంటలు ఎండి పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న 150 పడకల కొవిడ్ ఆస్పత్రికి మరో వంద పడకలు అదనంగా చేరుస్తున్నామని మంత్రికి జిల్లా కలెక్టర్ వెంకటరావు వివరించారు. మండల, గ్రామ స్థాయిలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మంత్రికి తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకుండా అందరూ పని చేయాలని కోరారు. మండల స్థాయిలో ఏమైనా సమస్యలొస్తే డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వారి ప్రాంతానికి సంబంధించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు, డీఆర్ఓ స్వర్ణలత, జడ్పీటీసీలు ,ఎంపీటీసీలు ,ఎంపీపీలు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.