రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టూరిజం బస్సును మంత్రి ఆదివారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పర్యాటకశాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కనుమరుగయ్యే దశలో ఉన్న ఎన్నో చారిత్రక, ప్రకృతి సిద్ధ దర్శనీయ ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
అతిపెద్ద కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్కు, శతాబ్దాల చరిత్ర ఉన్న పిల్లలమర్రి, పేదల తిరుపతి మన్యంకొండ, సాగునీటి ప్రాజెక్టులు జూరాల, కోయిలసాగర్, రమ్యమైన పర్యటక ప్రదేశం సోమశిల సందర్శన కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని, పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇందులోనే మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీఐపీ, ఉచిత, శీఘ్ర దర్శనం, ఉచిత ప్రసాదం అందించనున్నామని వివరించారు. పిల్లలమర్రి, కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులను ఉచితంగానే సందర్శించడంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా టిక్కెట్టు ధరలోనే అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా పాలమూరు పర్యాటకంపై రూపొందించిన బ్రోచర్‌ను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్‌రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర పర్యాటకశాఖ ఎండీ మనోహర్, పుర ఛైర్మన్ కేసీ.నర్సింహులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గుర్రాల స్వారీతో సరదాగా..
పాలమూరు పర్యాటకం" టూరిజం ప్రమోషన్లో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై గుర్రపు స్వారీ చేసి పట్టణ ప్రజలకు పర్యాటక వినోదం పంచారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సాయంత్రం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, పుర ఛైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించారు. అక్కట పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన గుర్రాలపై ఎమ్మెల్యే, మంత్రి స్వారీ చేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను రూపొందించామన్నారు. మహబూబ్‌నగర్ టూరిజం సర్క్యూట్' లో పర్యాటకులకు ఉపయోగంగా ఉండేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ టూరిజం సర్క్యూట్లలో పర్యాటకులు ప్రయాణించేందుకు దశల వారీగా బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలను ప్రారంభించిన మంత్రి వారితో కలిసి బతుకమ్మ ఆడారు.
ఇదీ చూడండి: