మహబూబ్నగర్లో జరిగిన బ్యాంకర్ల సంప్రదింపుల సలహా కమిటీ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 2020- 21కి సంబంధించి రూ.3,605 కోట్లతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. లక్ష లోపు రుణాలు కఠిన షరతులు లేకుండా ఇవ్వాలని మంత్రి సూచించారు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇచ్చే రుణాలకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకోవాలన్నారు.
త్వరలోనే రైతు బంధు
పేదలు బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు వస్తే ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వెంటనే ఇవ్వాలని బ్యాంకులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. గత ఏడాది 50% రుణ లక్ష్యాన్నే సాధించామని, ఈ సంవత్సరం లక్ష్యానికి మించి రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. నిర్దేశించిన 2,061 కోట్ల రూపాయల రుణాలను ఏలాంటి తేడాలు లేకుండా అందజేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రుణమాఫీ కింద రూ.11 కోట్ల 75 లక్షల రుణాలను మాఫీ చేశామన్నారు. ఈ వానాకాలానికి సంబంధించిన రైతుబంధు పెట్టుబడి త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు కరోనా సమయంలో రూ.8 కోట్ల రుణాలిచ్చామన్న ఆయన వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యాన శాఖ ద్వారా పట్టణంలో ఉన్న అన్ని రైతు బజార్ల వద్ద 5 రూపాయలకు భోజనం పెట్టే ఏర్పాటు చేయాలన్నారు.
వార్షిక ప్రణాళిక
పంట రుణాలకు రూ.2,061 కోట్లు, వ్యవసాయ కాలపరిమితి రుణాలకు రూ.388 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.2,906 కోట్లు, సూక్ష్మ చిన్న తరహా రంగానికి రూ.403 కోట్లు, విద్యారుణాలకు రూ.17 కోట్లు, గృహ రుణాలకు రూ.130 కోట్లు, ఇతర రంగాలకు రూ.165 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ.3,475.72 కోట్లు, ప్రాధాన్యేతరానికి రూ.130 కోట్లు రుణాలుగా ఇవ్వాలని వార్షిక ప్రణాళికను రూపొందించారు.
ఇదీ చూడండి : మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం