కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఎస్వీఎస్ ఆస్పత్రిలో కూడా ప్రభుత్వం తరఫున 100 పడకల కొవిడ్ వార్డు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సరిపడా పడకలు, ఆక్సిజన్, మందులు.. అన్నీ సిద్ధంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకుండా స్వీయ నియంత్రణలో ఉంటూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముందు జాగ్రత్తతో వైరస్ కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కరోనా నిర్ధరణ పరీక్షలకు జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ఎస్వీఎస్ ఆస్పత్రిలోని కరోనా వార్డును మంత్రి పరిశీలించారు. అత్యవసర సేవల విభాగాన్ని సందర్శించిన ఆయన.. ఎంత మంది రోగులున్నారు వారికి చికిత్స ఎలా అందుతోంది? పడకలు, ఆక్సిజన్, మందులపై ఆరా తీశారు.
- ఇదీ చదవండి : దేశంలో వరుసగా నాలుగోరోజు 3 లక్షలకుపైగా కేసులు