రాష్ట్రంలో సంక్షేమ పథకాలు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో రూ. 58 లక్షల అంచనాలతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో గతంలో ఎస్సీ కాలనీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, తాను గెలిచాక ఎనుగొండ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యను తీర్చానని చెప్పారు.
భూగర్భ మురుగునీటి వ్యవస్థతో రహదారులు పూర్తయితే ఎనుగొండ సమస్యలు తీరినట్లేనన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు తప్పకుండా రెండు పడక గదుల ఇళ్లిస్తామని, ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గడిచిన రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ. 100 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని, తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.