తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీటీసీలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు ఎంపీటీసీలకు అవకాశం కల్పించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు పల్లె ప్రగతిలో జోడెద్దుల లాంటి వారని అన్నారు.
ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఎంపీటీసీలకు ఇవ్వాలని మంత్రి చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీటీసీల గౌరవ వేతన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
అంతకుముందు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత మాసోత్సవాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు.