భారతదేశ చరిత్రలో తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొడంగల్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన ఆరోపించారు. మూడు సంవత్సరాల్లోనే రాష్ట్రంలో ఒక లక్షా 36 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ భాజపాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కంటే.. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతం వస్తుందని తెలిపారు. నిత్యం ధరలు పెంచుతూ దేశంలో ఉన్న ప్రజలను ఇబ్బందికి గురి చేయడమే... మోదీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఆరోపించారు. దమ్ముంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టడానికే ఫొటోలు పంపుతున్నారు తప్ప.. ఆ పార్టీలతో ప్రజలకు ఎటువంటి లాభం చేకూరడం లేదని విమర్శించారు.
తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. వాణీ దేవి గారికి విద్యా రంగంలో అపార అనుభవం ఉందని అన్నారు. ఆమెను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్, ఎంపీపీ ముద్దప్ప దేశ్మూఖ్, కౌన్సిలర్ మధు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తెరాసకు ఓటు వేస్తే చెప్పుకు వేసినట్లే: బండి సంజయ్