ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక్కో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా బతుకమ్మ ఘాట్లను నిర్మిస్తూ చెరువు కట్టలను పటిష్ఠం చేయాలి. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి కట్టల వెంబడి ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచాలి. ఈ పనులను చేపట్టి పూర్తిచేసే బాధ్యతలను ప్రభుత్వం చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు అప్పగించింది. అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రెండేళ్ల క్రితం 12 మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అయినా.. వాటిలో ఇప్పటి వరకు ఒక్క పనీ పూర్తవలేదు.
గడువు ముగిసినా పూర్తి కాలేదు
గుత్తేదారుల నిర్లక్ష్యంతో వివిధ నియోజకవర్గాల్లో మినీ ట్యాంక్‌బండ్‌ల పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంలా తయారయ్యాయి. కొన్ని మినీ ట్యాంక్‌బండ్‌లను పూర్తిచేయడానికి నిర్ణీత గడువు ముగిసినా.. ఇప్పటి వరకు పూర్తవలేదంటే వీటి నిర్మాణంలో గుత్తేదారులు, అధికారులు ఏ మేరకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పూర్తైన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతోనే గుత్తేదారులు వీటి నిర్మాణ విషయంలో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బిల్లు చెల్లించలేదని వదిలేశారు
పనుల ప్రారంభ సమయంలో ఉత్సాహం చూపిన గుత్తేదారులు ఆ తరవాత బిల్లులు మంజూరవడం లేదన్న కారణంతో పట్టించుకోవడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొంత భాగం పనులు పూర్తయితే ఈ రెండు మినీ ట్యాంక్‌బండ్ అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం బిల్లులను చెల్లించడం లేదన్న ఉద్దేశంతో గుత్తేదారులు మిగిలిన పనులను పూర్తి చేయకుండా వదిలేశారు. ప్రధానంగా బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికే ప్రభుత్వం మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది. మరో మూడు నెలల్లో బతుకమ్మ పండుగ జరగనున్నా.. ఇంతవరకు పనులు కొలిక్కి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
పనుల వేగానికి చర్యలు
జిల్లాలో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ ఈఈ మురళి తెలిపారు. అచ్చంపేట మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి గుత్తేదారుకు విధించిన గడువు ముగియడం వల్ల ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని వెల్లడించారు.
- ఇదీ చూడండి : 'సినిమాలతో భాషలు వచ్చాయి.. ప్రైవసీ పోయింది'