రవాణా శాఖకు చెల్లించాల్సిన త్రైమాసిక పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్ నగర్ రవాణా కార్యాలయం ఎదుట మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని మల్లికార్జున చౌరస్తా నుంచి రవాణా శాఖ కార్యాలయం వరకూ క్యాబ్‌లతో ర్యాలీ నిర్వహించారు. డ్రైవర్లు, యజమానులు కార్యాలయం ముందు రాస్తారోకో చేశారు.
అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పన్నులు చెల్లించలేమని.. అందుకే వాహనాలను ఆర్టీఓ కార్యాలయంలోనే ఉంచుకోవాలన్నారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు హామీ ఇవ్వగా... ఆందోళన విరమించారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా మాక్సీ క్యాబ్‌లు అడ్డాకే పరిమితమయ్యాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయిలు లేక పన్నులు కట్టే పరిస్థితి లేదని గోడు వెల్లబోసుకున్నారు. ప్రైవేటు వాహన యజమానులు, డ్రైవర్లపై ప్రభుత్వం కనికరం చూపాలని వేడుకున్నారు.