MVS Junior College Problems In Mahbubnagar : నెర్రలు బారిన గోడలు.. పెచ్చులూడుతున్న పైకప్పులు.. నేలపై పగిలిన బండలు.. విరిగిన బెంచీలు.. అసౌకర్యాల నడుమ బిక్కుబిక్కుమంటూ చదువులు వెళ్లదీస్తున్నారు ఆ విద్యార్ధులు. ఆడపిల్లలకు మరుగుదొడ్ల కొరత.. మగపిల్లలకైతే అసలు లేనేలేవు. వసతులైతే మచ్చుకైనా కానరావు. చదువు సంగతి దేవుడెరుగు.. కళాశాల నుంచి సురక్షితంగా బయటపడితే చాలనుకుంటున్నారు విద్యార్థులు. మహబూబ్‌నగర్ క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(MVS govt Junior College) దుస్థితి ఇది.
మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో సమస్యలు తిష్ట వేశాయి. 1996లో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన కళాశాల భవనంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు వెళ్లదీస్తున్నారు. తరగతి గదుల్లో పైకప్పులు పెచ్చులూడిపడుతూ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కళాశాలలో 480 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ కలిపి కేవలం 10 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Govt MVS Junior College in Mahbubnagar : విద్యుత్ లేక గదుల్లో వెలుతురు, ఫ్యాను సౌకర్యం లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. 480 మంది విద్యార్థుల్లో 172 మంది బాలికలు. వారందరికీ కలిపి ఉన్నది రెండే మరుగుదొడ్లు. వాటిని శుభ్రం చేసే వారు లేక దుర్వాసన వెదజల్లుతున్నాయి. కనీసం వాటికి తలుపులు లేక లోపలికి వెళ్లాలంటే బయట ఒకరు కాపలా ఉండాల్సిన దుస్థితి.
సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ యూనివర్సిటీ
MVS Junior College Problems : ఈ కళాశాలలో 300 మంది బాలురకు ఒక్క మరుగుదొడ్డీ లేకపోవడం గమనార్హం. తరగతులు జరిగే సమయంలో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా తమ సమస్యలను పట్టించుకుని పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల రాత్రివేళల్లో మందుబాబులు ప్రాంగణంలో మద్యం సేవించి, సీసాలను తరగతి గదుల్లో పగులగొడుతున్నారు. కళాశాలకు తాగునీటి సౌకర్యం లేదు. అవసరాలకు బోరునీటిని వాడుతున్నారు. మిషన్ భగీరథ కోసం కళాశాల స్థలాన్నే తీసుకున్న అధికారులు.. కుళాయి మంజూరు మాత్రం మరిచారు.
"బిల్డింగ్ సమస్య ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆర్ అండ్ బీ అధికారులను పంపించి, ఇన్స్పెక్షన్ చేశారు. మరుగుదొడ్లు రోడ్లు వైడింగ్లో పోయాయి.ఇప్పుడు ఆ మరుగుదొడ్లు కూడా పరిష్కరిస్తారని భావిస్తున్నాం. పిల్లలకు క్లాస్ రూమ్‌లు సరిపోతున్నాయి. కానీ ఉన్న క్లాస్ రూంలతోనే సమస్య. మిషన్ భగీరథ నీళ్లు వస్తే చాలా మంచిది." - డా. కే.భీంరెడ్డి, ప్రిన్సిపల్
గదుల కొరత ఉన్నదన్న మాట వాస్తవం..: కళాశాల దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్లామని ప్రిన్సిపల్ భీంరెడ్డి తెలిపారు. గదుల కొరత వేధిస్తున్న మాట వాస్తవమేనన్నారు. నీటి సమస్య తీర్చడానికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేశామని, త్వరలోనే నీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి తాత్కాలికంగానైనా మరో భవనానికి కళాశాలను తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Problems in Govt School : 'ఈ భోజనం మేం తినలేకపోతున్నాం సార్'
Mallapur Model School Problems : ఇది పాఠశాలనా లేక... సమస్యల అడ్డానా..?