Mahabubnagar Pedda Cheruvu kabja : మహబూబ్‌నగర్‌లోని పెద్దచెరువు ఆక్రమణలపై అధికార యంత్రాంగం మౌనం వీడటం లేదు. తటాకం పూర్తి స్థాయి నీటి మట్టం పరిధి, బఫర్ జోన్, కాలువలు వాటి బఫర్ జోన్లు గుర్తించినా, ఆ పరిధిలో వెలిసిన అక్రమణలపై చర్యలు శూన్యం. వెరసి చెరువు ( Mahabubnagar Pedda Cheruvu)చుట్టూ భవన నిర్మాణ వ్యర్థాలను పోస్తూ క్రమంగా స్థలాన్ని సృష్టించి ఆక్రమించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
Illegal Constructions in Pedda cheruvu : సర్వే నంబరు 67లో పెద్దచెరువు గతంలో 96 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏళ్ల తరబడి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్ల అది 50 ఎకరాలకే పరిమితమైంది. చెరువు నుంచి నీళ్లు బయటకు తీసుకువెళ్లే కాల్వలను సైతం అక్రమార్కుల చెరలో బందీ అయ్యాయి. వర్షాకాలంలో తటాకంలో నిల్వ ఉండాల్సిన నీళ్లు, పారే కాల్వలు లేక చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తుతున్నాయి. అందుకు కారణం ఆక్రమణలేనని గుర్తించిన అధికారులు ఎఫ్‌టీఎల్ పరిధిని గుర్తిస్తూ దిమ్మెలు ఏర్పాటు చేశారు.
Mahabubnagar cheruvu: అభివృద్ధి సరే.. మరి అక్రమాల సంగతేంటి..?
బఫర్ జోన్ ఆక్రమించి మరీ కట్టడాలు : ఈ పరిధిలో 64 అక్రమ నిర్మాణాలు (Illegal Constructions Pedda cheruvu)ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బఫర్ జోన్లలో 75కు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించినా వాటిని తొలగించలేదు. పెద్దచెరువుకు కాలువలు, బఫర్ జోన్ ఆక్రమించి మరీ దర్జాగా కట్టడాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు పైరవీలతో ముఖ్య నేతల్ని ఆశ్రయించి వాటి జోలికి రాకుండా చక్రం తిప్పారు. అప్పటి నుంచి ఆక్రమణలను పట్టించుకున్న నాథుడే కరవయ్యారు.
"బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో బఫర్ జోన్ అంటూ నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఓ కార్పొరేట్ కంపెనీకి మాత్రం అనుమతులు ఇచ్చారు. ఇప్పటికైనా అధికాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అలాగే వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చేయాలి." - పాండు రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్
అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితం : పెద్దచెరువు సుందరీకరణ పేరుతో ఆక్రమణల్ని, సక్రమం చేసే ప్రయత్నాలు సైతం జోరుగా సాగుతున్నాయి. చుట్టూ నెక్లెస్ రోడ్డు పేరుతో తటాకం పరిధిని తగ్గిస్తూ, మరో కొత్తకట్ట నిర్మించారు. ఎఫ్‌టీఎల్ పరిధి ఆ కట్ట లోపలికి మారిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని కట్ట బైట ప్రస్తుతం మట్టి, ఇటుక, సిమెంట్, ఇసుక వ్యర్థలాను పోస్తూ పూడ్చేస్తున్నారు. వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి ఆక్రమించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం గతంలో గుర్తించిన ఆక్రమణలు మాత్రమే ఉన్నాయని, కొత్తగా నిర్మాణాలు ఏమీ లేవని చెప్పడం కొసమెరుపు. కఠిన చర్యలనే మాటలు ప్రకటనలకే పరిమితమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
"నిబంధనలు అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు పెద్దచెరువు దగ్గర ఆర్‌అండ్‌బీ పనులు సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై తనిఖీలు చేపడుతాం. ఎవరైనా ఎన్‌వోసీ కావాలంటే మా దగ్గర దరఖాస్తు చేసుకుంటారు. అప్పుడు వారు బఫర్ జోన్ పరిధిలో ఉన్నారు లేక వేరే పరిధిలో ఉన్నారా అని తనిఖీ చేసి వారి ఎన్‌వోసీ ఇవ్వడం జరుగుతుంది." - వెంకటయ్య, నీటి పారుదల శాఖ ఈఈ
Unikacherla lake kabza : బతుకుదెరువుపై.. బడా రియల్టర్ల కన్ను
గతంలో పెద్దచెరువు పరిధి ఎక్కడి వరకు ఉందో గుర్తించి దాని ప్రకారం ఎఫ్‌టీఎల్ నిర్ధారిస్తే వందల ఆక్రమణలు బయటపడతాయి. అలా కాకుండా ప్రస్తుతం నిర్మించిన కట్ట ఆధారంగా ఎఫ్‌టీఎల్ నిర్ధారించి, గతంలో ఆ పరిధిలోని ఆక్రమణలపై ఎలాంటి చర్యలు లేకుండా కొందరు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి గతంలో చెరువు పరిధుల్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించి పెద్ద చెరువుకు పునర్వైభవం తేవాలని, కబ్జాకు గురవుతున్న కాలువల్ని కాపాడాలని మహబూబ్‌నగర్ పురప్రజలు కోరుతున్నారు.
Pond Occupation: నిండుగా నీళ్లుండగానే చెరువు కబ్జా.. ఏకంగా ప్రహరీనే కట్టేశారు