Drip Irrigation Problems: బిందుసేద్యానికి రాయితీతో పరికరాల పథకానికి... మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రహణం పట్టింది. పథకం అమలు దాదాపుగా నిలిచిపోయింది. బిందుసేద్యం ద్వారా మొక్కకు కావాల్సిన నీటిని... పైపుల ద్వారా చుక్కలు చుక్కలుగా అందిస్తారు. ఒకే మోతాదులో ప్రతి మొక్కకు నీరు అందడం, రసాయన ఎరువులను సరఫరా చేయటం వల్ల మొక్కలు ఏపుగా ఎదిగి... అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు. సంప్రదాయ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం 30 నుంచి 40శాతం ఉంటే.. బిందు సేద్యంలో 90 నుంచి 95 శాతం వరకు ఉంటుంది. రైతులకు ఆ బిందుసేద్యం పరికరాలు అందకపోవడంతో ఎప్పటికప్పుడు నేలను చదునుచేయటం, కాల్వలను తవ్వటం, నీటిని పారబెట్టటం, ఎరువులు వేయటం వంటి పనులకు కూలీలను వినియోగించాల్సి రావడంతో భారంగా మారింది.
రైతుల ఆవేదన...
వరికి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని రైతులు వాపోతున్నారు. కూరగాయలు, ఉద్యాన పంటల వైపు ఆసక్తి చూపుతున్నా.... అందుకనుగుణంగా సహకారం లేదని చెబుతున్నారు. బిందుసేద్యం పరికరాలకు భారీగా వ్యయం కానుండటంతో రాయితీతో అందించాలని దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా.. స్పందన లేదని పేర్కొన్నారు. ఖర్చులు గణనీయంగా పెరిగి ఆదాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లుగా ఇబ్బందులు...
సాగునీటి పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించింది. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ రాయితీపై మంజూరు జరిగేది. ప్రస్తుతం మూడేళ్లుగా పరికరాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2019-20కి బిందు, తుంపర సేద్యానికి నిధులు మంజూరు కాలేదు. గతేడాది 752 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసినా ధరలు పెరిగాయంటూ కంపెనీలు పరికరాలు అందించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మంజూరుచేసి ప్రాధాన్యత ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు అందిస్తామని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రాయితీతో బిందుసేద్యం పరికరాలందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:KTR Comments: 'రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం'