మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో హరితహారం కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ ఎస్. వెంకట్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మన్యంకొండ దేవస్థానం చుట్టూ పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అందుకు అవసరమయ్యే మొక్కలను సిద్ధం చేసి ఉంచాలని చెప్పారు. హోం ప్లాంటేషన్‌లో నాటాల్సిన మొక్కలను సరఫరా చేయాలని.. ఇప్పటివరకు నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఉన్న 441 గ్రామ పంచాయతీల్లో రూరల్ పార్క్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. శ్మశానవాటికల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. విరాసిత్, నాళాల, పార్ట్-బిలకు సంబంధించిన కేసులను త్వరగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దారులను ఆదేశించారు. జిల్లాలో టీఎస్-ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. .