New Joinings in Mahbubnagar Congress : అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో.. నూతనోత్సాహం కనిపిస్తోంది. ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నాయకులు పార్టీలో చేరనుండటం జోష్ నింపింది. మాజీమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు జూపల్లి కృష్ణారావు.. జులైలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి, కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన జూపల్లికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక అనుచరగణం ఉంది. వారంతా కాంగ్రెస్‌లోకి వస్తే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలం పెరగనుంది.
Telangana Congress Latest News : ఇక నాగర్‌కర్నూల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్‌రెడ్డి సైతం.. హస్తం పార్టీలో చేరనున్నారు. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిలో స్థానిక నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్న కూచుకుళ్ల.. తన కుమారుని రాజకీయ భవిష్యత్ కోసం హస్తం పార్టీకి పంపించారు.
ఇక వనపర్తి నియోజకవర్గంలో పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి.. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన పలువురు ప్రజా ప్రతినిధులు.. హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి మాజీఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఓ ఎన్ఆర్ఐ పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
పాలమూరు జిల్లాపై తనదైన ముద్ర ఉండాలని : అచ్చంపేట నియోజకవర్గం నుంచి జూపల్లి వర్గీయులు.. పెద్దఎత్తున కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాపై తనదైన ముద్ర ఉండాలని జూపల్లి కృష్ణారావు ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నేతల్ని ఏకంచేసేందుకు తెరవెనక ప్రయత్నాలు గట్టిగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్లో అంసతృప్త నాయకుల్ని.. హస్తంగూటికి చేర్చి వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీని ఓడించడం సహా కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేయాలన్న వ్యూహాంతో ముందుకు సాగుతున్నారు.
Telangana Assembly Elections 2023 : గద్వాలలో ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తున్నారు. అధికార పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోతే ఆయన సైతం హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతో బీజేపీలో చేరాలనుకున్న వివిధ పార్టీల ద్వితీయశ్రేణి, కిందిస్థాయి నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వారంతా జూలైలో మహబూబ్‌నగర్ జిల్లాలో అగ్రనేతలు హాజరయ్యే బహిరంగ సభలో పెద్ద ఎత్తున చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Telangana Elections 2023 : తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నది జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ వంటి నేతలే. అలాంటి జూపల్లి తిరిగి సొంతగూటికి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని శ్రేణులు అంచనా వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంతజిల్లా కావడంతో జులై రెండోవారంలో ప్రతిష్ఠాత్మకంగా సభ నిర్వహించే అవకాశం ఉంది. ఆ సభకు ప్రియాంకగాంధీ లేదా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి: