నిబంధనల సడలించడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లాక్డౌన్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. సాధారణ రోజల్లో లాగే రోడ్ల పైన జనం రద్దీ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ లాంటి పట్టణాల్లో పక్క, పక్కనే ఉన్న దుకాణాలు సైతం తెరిచారు. ఎవరెవరు ఎప్పుడు తెరవాలన్న అంశంపై స్పష్టమైన ఆదేశాలు పురపాలిక నుంచి అందలేదు. ఫలితంగా దుకాణాల వద్ద జనం గుమికూడి కనిపిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలన్న నిబంధనను తుంగలో తొక్కారు. నోమాస్క్- నో గూడ్స్, నో సర్వీస్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా దుకాణాదారులెవరూ చర్యలు తీసుకోలేదు. కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోకుండానే జనం వీధుల్లో తిరుగుతున్నారు.
రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో...
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే కార్యాలయాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మందకోడిగా ఉన్న రిజిస్ట్రేషన్లు ఇకపై పుంజుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రెండు, మూడు గంటల్లోనే దస్త్రాలిచ్చి పంపించేస్తున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లాలోని 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 78 రిజిస్ట్రేషన్లు కాగా... నేడు ఆ సంఖ్య 120కిపైగా చేరే అవకాశం కనిపిస్తోంది.
రవాణాశాఖ ఆఫీసుల్లో...
ఇక రవాణాశాఖ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. గతంలో వంద స్లాట్ బుకింగ్‌లకు అవకాశం ఉన్న చోట... ప్రస్తుతం 40 స్లాట్ బుకింగ్‌లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వాటిల్లో లెర్నింగ్, పర్మినెంట్, వాహనాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నారు. రవాణా కార్యాలయాల వద్ద రద్దీ కనిపించట్లేదు. ఇక ఆర్టీఏ ఆఫీసుకు వచ్చేవాళ్లు మాస్కు ధరించడం తప్పనిసరి. షానిటైజర్లు సైతం అందుబాటులో ఉంచారు. మద్యం దుకాణాల వద్దా నిన్నటి సందడి నేడు కనిపించలేదు. వ్యవసాయం, భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని దుకాణాలు తెరిచారు.
వలస కూలీలకు...
ఉమ్మడి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కార్మికులు పోలీస్ స్టేషన్లు, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలోని ఒకే ప్రాంతానికి వెళ్లేందుకు 1200 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే వారిని రైళ్లల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి : టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్: నాగం