Encroachment of Ponds in Mahbubnagar: అధికవర్షాలతో మహబూబ్‌నగర్ పెద్ద చెరువు నిండి మూడేళ్లుగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఏటా ముంపు సమస్య తీవ్రమవుతోంది. రెండు అలుగుల నుంచి వెళ్లే కాల్వలు ఆక్రమణకు గురికావడమే అందుకు కారణమని.. వాటిని తొలగించి విశాలమైన వరద కాల్వలు నిర్మించి సమస్యకు శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కేవలం పెద్ద చెరువు మాత్రమే కాకుండా పట్టణంలోని చాలా చెరువుల వద్ద అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల వర్షాలకు ఎర్రకుంట నిండి కుర్హిని శెట్టి కాలనీలోకి నీరు చేరింది. ముంపు తప్పించేందుకు తూము తెరవడంతో దిగువన ఉన్నగణేష్‌నగర్‌లోకి వరద పోటెత్తింది. హైదరాబాద్- రాయచూర్ జాతీయ రహదారిపైకి నీరుచేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ పరిస్థితికి కారణం ఎర్రకుంట అలుగు, తూము కాల్వలు కబ్జాకు గురికావడమే.
ఎర్రకుంట అలుగు వద్ద శ్మశానవాటిక ఏర్పాటు చేయడంతో నీళ్లు దిగువకు వెళ్లలేక చెరువు పరిధిలో నిర్మించిన ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. సుమారు 30 ఎకరాల్లో ఎర్రకుంట విస్తరించి ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ పరిధిలో 7, బఫర్‌జోన్‌లో 36 అక్రమ కట్టడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లుగా అక్కడే ఉన్నామని పురపాలిక, రెవెన్యూ సహా ఇతర శాఖల అనుమతులున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఎర్రకుంటతో ముంపు రాకుండా చెరువు పూడికతో పాటు, మరోతూము నిర్మించి నీళ్లు బయటకు పంపాలని వారు కోరుతున్నారు. పాలకొండ చెరువు చుట్టు పక్కల ఉండే కాలనీలకు ముంపు సమస్య పొంచి ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలో 29, బఫర్‌జోన్‌లో 25 నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చెరువు పూర్తిగా నిండితే ఎగువన ఉన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.
చెరువులు, కుంటలు, కాల్వల్లో నిర్మాణాలకు గతంలో అనుమతులిచ్చినా అవి చెల్లవని అధికారులు చెబుతున్నారు. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మహబూబ్‌నగర్ పరిధిలో 32 చెరువులుండగా దాదాపు అన్ని చెరువుల్లోనూ అక్రమణలు వెలిశాయి. భవిష్యత్తులో పాలమూరులో ముంపు లేకుండా చెరువుల పరిరక్షణతో పాటు, వరద కాల్వలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
"మా దగ్గర అన్నింటికి పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి నీళ్లు వచ్చే చోట మీరు ఇండ్లు ఎలా కట్టారు అని అడుగుతారు. అధికారులు పర్మిషన్ ఇస్తేనే ఇల్లు కట్టుకున్నాం. అలుగు మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది. అధికారులు వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే తూమును బాగు చేస్తారు. తర్వాత దానిని పట్టించుకోరు." -స్థానికులు
ఇవీ చదవండి: ఈ 'ముంపు' కష్టాలు ఇంకెన్నాళ్లు.. పరిష్కారానికి ఇంకెప్పుడు..?