Old Collectorate Building In Mahabubnagar: మహబూబ్‌నగర్ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పాత కలెక్టరేట్ కార్యాలయం త్వరలోనే కనుమరుగుకానుంది. వెయ్యి పడకల సూపర్ స్పెషాటిలీ ఆస్పత్రి నిర్మాణం కోసం పాత కలెక్టరేట్ భవనాన్ని త్వరలోనే కూల్చివేయనున్నారు. అందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిజాంల కాలంలో నిర్మించిన ఈ భవనానికి 86ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో 8 తాలుకాలతో ఉన్న పాలమూరు జిల్లాకు నాగర్‌కర్నూల్ కేంద్రంగా ఉండేది.
ఏడాదిలో ఎక్కువకాలం మహబూబ్‌నగర్‌లోనే: ఆ తర్వాత తాలుకాల సంఖ్య 10కి పెరగడంతో పాలమూరు కేంద్రంగా అప్పటి జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ గౌరవార్థం 1890లో మహబూబ్‌నగర్‌గా పేరు మార్చారు. తరచూ వేటకు వెళ్లే 6వ నిజాం ఏడాదిలో ఎక్కువకాలం మహబూబ్‌నగర్‌లోనే ఉండేవారట. మొదట ఆయన ఉండేందుకు తాత్కాలికంగా నిర్మాణాలు చేశారు. 1909లో సికింద్రాబాద్ నుంచి కర్నూల్ మీదుగా డోన్ వరకు రైలుమార్గం ఏర్పాటు కావటంతో శాశ్వత కట్టడాలు నిర్మించారు.
బారా కచేరిగా పిలిచేవారు: మొదట 1923లో ప్రస్తుత జిల్లా విద్యాశాఖ కార్యాలయ భవనం, అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తి చేశారు. 1931లో జిల్లా కలెక్టరేట్ నిర్మాణం మొదలు పెట్టి.. 1936లో ప్రారంభించారు. దీన్ని బారా కచేరిగా పిలిచేవారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన 12 శాఖలు అక్కడ ఉండేవన్నమాట. సైన్యాధిపతులు, పాలెగాళ్లు, సైన్యం అనుంబంధ సంస్థలు ఉండేందుకు.. ఇప్పుడు బాలుర జూనియర్ కళాశాలగా ఉన్న భవనాన్ని, అతిథి గృహన్ని నిర్మించారు.
45 మంది కలెక్టర్లకు ఇదే కార్యాలయం: 1948లో హైదరాబాద్ సంస్థానం.. భారత్‌లో విలీనం కావడంతో అప్పటి నుంచి ప్రభుత్వ పాలన మొదలైంది. 1960-61 నుంచి ఇప్పటివరకు 45 మంది కలెక్టర్లు ఇదే కలెక్టర్ కార్యాలయం నుంచి పరిపాలన సాగించారు. 2022 డిసెంబర్ 4న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడంతో పాత కలెక్టరేట్‌లో పాలనా వ్యవహారాలకు తెరపడింది. పాత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా విద్యాశాఖ కార్యాలయం సహా నిజాం కాలం నాటి పాత భవనాలతో ఉమ్మడి జిల్లా ప్రజలకు.. వివిధ శాఖల్లో సేవలందించిన ఉద్యోగులకు ప్రత్యేక అనుబంధం ఉంది.
వారసత్వ సంపదగా గుర్తించాలి: హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా భవనాలు ఎక్కడా లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భవనాలన్ని శిథిలావస్థకు చేరినా, వారసత్వ సంపదగా గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాలమూరు చరిత్రకు సాక్షాలుగా నిలిచే ఈ భవనాన్ని సంరక్షించాలని వినతులు వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
"మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టరేట్ భవనం అంటే ఆ రోజుల్లో ఎంతో ఆసక్తిగా చూసేవాళ్లం. దీన్ని బారా కచేరిగా పిలిచేవారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన 12 శాఖలు ఉండేవి. అంతటి చరిత్రకు సాక్షిగా నిలిచిన భవనాన్ని పరిరక్షించుకోవాలి. ప్రభుత్వం దీనిని వారసత్వ సంపదగా గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం." - స్థానికులు
ఇవీ చదవండి: కేంద్రంలో రైతు సర్కార్ రావాలి: కేసీఆర్