మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ సమీపంలోని గుట్టల ప్రాంతంలో చిరుత పులులు సంచరిస్తున్నాయని అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రయ్య తెలిపారు. కొన్ని రోజులుగా చిరుతలు తిరుగుతున్నాయంటూ రైతులు సమాచారం అందించారని పేర్కొన్నారు. పులులు సంచరిస్తోన్న చోటుకు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.
కొండ ప్రాంతంతో పాటు రైతుల పంట పొలాలను పరిశీలించారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో పులుల జాడల కోసం అన్వేషించారు. పులులు గుట్టలను ఆవాసం చేసుకొని ఉంటాయని ఉదయం, సాయంకాలం నీళ్లు తాగేందుకు బయటకు వస్తుంటాయని వివరించారు. వీటికి సంబంధించి జాడలు కనుగొన్నామని.. అవి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని స్పష్టం చేశారు.
కొన్ని రోజుల వరకు రైతులు పశువులను పంట పొలాల వద్ద కాకుండా ఇంటి వద్ద ఉంచుకోవాలని సూచించారు. చిరుతపులులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని రైతులను కోరారు. ఎవరికైనా కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారమందించాలని సూచించారు.
ఇదీ చూడండి: ఫంక్షన్కు తీసుకెళ్లలేదని యువతి ఆత్మహత్య