funds shortage for mana ooru manabadi : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి మొదటి విడత పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. పనులు జరిగిన బడులు... సకల వసతులతో విరాజిల్లుతుంటే... పూర్తి కాని చోట్ల సమస్యలు తిష్ఠ వేశాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. బిల్లులు ఆలస్యంతో... పనుల్లో జాప్యం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల దేవరకద్ర మండలం కోయల్‌సాగర్‌లో... మనఊరు-మనబడి కింద చేసిన పనులకు బిల్లులు రాక విసిగిపోయిన గుత్తేదారు... పాఠశాలకు తాళం వేసి నిరసన చేపట్టారు. నారాయణపేట బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో గుత్తేదారు రూ.4 లక్షల విలువైన పనులు చేయగా ఇంకా రూ.2 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. నారాయణపేట జిల్లాలో రూ.80 కోట్ల అంచనాలను సిద్ధం చేయగా... ఇప్పటి వరకు రూ.2 కోట్లు మాత్రమే చెల్లింపులయ్యాయి.
Delay In Payments Of Manauru Manabadi : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడతలో 1004 పాఠశాలలు ఎంపిక కాగా.. 976 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. రూ.397 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. తొలుత మేజర్, మైనర్ మరమ్మత్తులు, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం పనుల్ని గుత్తేదారుల ద్వారా చేపట్టారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ, వంట గది పనుల్ని ఉపాధిహామీ పథకం కింద చేపట్టారు. రూ.397 కోట్ల పనులకు గాను ఇప్పటి వరకు నిధులు చెల్లించింది రూ.54 కోట్లే. ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు సైతం కోట్లలో పేరుకుపోయాయి. చాలాచోట్ల ఇప్పటికీ పనులు పురోగతిలోనే ఉన్నాయి. పాఠశాల యాజమాన్య కమిటీలు, సర్పంచ్‌లకు మధ్య వివాదాలు నెలకొనడం వంటి కారణాలతో మహబూబ్‌నగర్ జిల్లాలో 23 పాఠశాల్లో పనులే ప్రారంభం కాలేదు. ఉపాధిహామీ కింద చేపట్టాల్సిన 40 పాఠశాలలు పనులు మినహా మిగిలిన అన్ని పనులూ పూర్తయ్యాయి. వనపర్తి జిల్లాలో రూ.80 కోట్ల అంచనా వేయగా...ఇప్పటి వరకు రూ.18 కోట్లు మాత్రమే చెల్లించారు.
'స్కూల్ పని పూర్తి చేసి 6 నెలలు అవుతోంది. కొన్ని బిల్లులు ఇచ్చారు కానీ మరికొన్ని ఇవ్వలేదు. ఏఈకి ఈ విషయం చెప్పినా వినిపించుకోలేదు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా వారు బిల్లులు ఇవ్వమని చెప్పారు. దయచేసి మా బిల్లులు ఇప్పించండి సారు. నాకు రూ.2 లక్షలకు పైగా డబ్బులు రావాలి. దేవసేన మేడమ్ కూడా వచ్చి పనులను చుశారు. మంచిగా చేశారు అని చెప్పి వెళ్లారు. అయినా కూడా బిల్లులు ఆపిర్రు'. - కాంట్రాక్టర్.
mana ooru manabadi bills delay : జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత 161 పాఠశాలలు మొదటి విడతలో ఎంపిక కాగా.. కేవలం 3 బళ్లు మాత్రమే ప్రారంభానికి నోచుకున్నాయి. రూ.44 కోట్ల పనులకు రూ.10 కోట్ల చెల్లింపులు మాత్రమే జరిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 195 పాఠశాలలు ఎంపిక కాగా...10 పాఠశాలలు పనులు పూర్తి చేసుకుని ప్రారంభమయ్యాయి. రూ.52కోట్ల అంచనా వ్యయానికి రూ.12 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే... పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: