మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. భారీ భద్రత నడుమ ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం పల్లమర్రి నుంచి ఉద్దాల చాటను ఊరేగింపుగా వడ్డెమాన్కు తీసుకొచ్చారు. వడ్డెమాన్లో గంటపాటు ఉద్దాల దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ అప్పంపల్లి, తిరుమలపూర్ మీదుగా కురుమూర్తి ఆలయానికి స్వామివారి ఉద్దాలు చేరుకున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి సమర్పించారు. వడ్డెమాన్ నుంచి కురుమూర్తి వరకు జరిగిన ఊరేగింపులో భారీ ఎత్తున భక్తజనం పాల్గొని పాదుకలను దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద జరిగిన ఉద్దాల ప్రదక్షిణ తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పాదుకలను తాకేందుకు పోటీపడ్డారు. జాతర మొత్తంలో స్వామి వారి ఉద్దాలను దర్శించడం, తాకడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం