KTR Inaugurated Skill Development Centre : రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యాన్ని పొంది.. వాటిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకున్న యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల ఐటీఐ కళాశాల ఆవరణలో సియెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డిలతో కలిసి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి రూ.వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. వాటిల్లో ఉద్యోగాలు పొందే నైపుణ్యాలను స్థానిక యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. గూగుల్ వంటి సంస్థలు అత్యధిక సాంకేతికత, సమాచారం, విజ్ఞానం ఆధారంగానే రూ.లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
Minister KTR Latest News in Telugu : ఈ క్రమంలోనే ఒకప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలంటే రెడ్ టేప్ ప్రభుత్వం ఉండేదని ఎద్దేవా చేసిన మంత్రి.. ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఎర్ర తివాచీ పరిచి పరిశ్రమలకు స్వాగతం పలుకుతున్నామని వివరించారు. నైపుణ్యాభివృద్ధి రంగంలో తెలంగాణ యువతను ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్న ఆయన.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నేర్చుకున్న నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉంటుందని చెప్పారు. విద్యార్థులు నైపుణ్యాలు అలవర్చుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయని స్పష్టం చేశారు. ఆర్థికంగా లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఐఐటీ, ఐఐఎంలో సీట్లు సంపాదిస్తుండటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు.
నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలి. నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే ఎక్కడైనా బతకొచ్చు. నైపుణ్యాలు ఉన్నా.. కొంతమంది విద్యార్థులు భయం వల్ల ఆగిపోతున్నారు. విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం. గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్థులు ఐఐఎం, ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగాలను యువత అందిపుచ్చుకోవాలి. విద్యార్థులు నైపుణ్యాలు అలవర్చుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి. - కేటీఆర్ ఐటీ, పురపాలక శాఖ మంత్రి
ఈ సందర్భంగా కొంతమంది గత 9 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని.. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదా అని ప్రశ్నించారు. ఊరూరా చెరువులను నింపి.. సాగు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా అని నిలదీశారు. గతంలో రూ.56 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు.. ప్రస్తుతం 400 శాతం పెరిగి.. 2 లక్షల 40 వేల కోట్లకు చేరుకున్నదని గుర్తు చేశారు. 3 లక్షల 23 వేల ఐటీ ఉద్యోగులు ఉన్న రాష్ట్రంలో.. ఇప్పుడు 9 లక్షల 5 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ స్వయంగా వచ్చి హైదరాబాద్ మారిందన్న మాటం వాస్తవం కాదా అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అందుతుందని.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని చెప్పుకొచ్చారు. అనంతరం నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందిన 120 మంది మహిళలకు మంత్రి కేటీఆర్ నియామక పత్రాలను అందజేశారు.
ఇవీ చూడండి..
KTR on Investment Roundtable Meeting : 'తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది'
KTR Comment on Congress: 'పదేళ్లుగా అధికారంలో లేక.. కాంగ్రెస్ ఫ్రస్టేషన్‌లో ఉంది'
Actress Dimple Hayati Case : హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్.. న్యాయస్థానం ఏం చెప్పిందంటే..