ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం కింద.. ఆయకట్టు విస్తరించాలన్న లక్ష్యం ఏళ్లు గడిచినా ఎక్కడిగొంగలి అక్కడే ఉన్న చందంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 12వేల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందుతుంది. ఆయకట్టును విస్తరించాలన్న లక్ష్యంతో కాల్వలు పొడిగించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోనే పనులు చేపట్టారు. రాష్ట్రం ఏర్పడి 8ఏళ్లు గడుస్తున్నా కుడికాల్వ విస్తరణ పనులు మొదలే కాలేదు. ఎడమ కాల్వ పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.
ప్రధాన కాల్వల నిర్మాణాలు దాదాపుగా పూర్తైనా.. డిస్టిబ్యూటరీలు, పిల్ల కాల్వలు, వాటిపై వంతెనలు, యూటీల్లాంటి నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. తీలేరు పంపుహౌస్ నుంచి మొదలయ్యే 13 కిలోమీటర్ల లింక్ కెనాల్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీనికింద 24వేల ఎకరాల ఆయకట్టు ఉంది. లింక్ కెనాల్ ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తికాగా.. అత్యధిక ఆయకట్టు ఉన్న 12వ డిస్టిబ్యూటరీ కింద చేపట్టాల్సిన 29 కిలోమీటర్ల కాల్వ పనులు అసంపూర్తిగా మిగిలాయి. తద్వారా చివరి ఆయకట్టు వరకూ ప్రస్తుతం సాగునీరు అందట్లేదు.
భూసేకరణ సమస్యలు.. పనులు పూర్తికాకపోవడానికి పరోక్ష కారణంగా నిలిచాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 130, నారాయణపేట జిల్లాలో 80 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంది. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వారంతా పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. భూములిచ్చినా నీళ్లు రాకపోవడం వల్ల పిల్ల కాల్వలను తిరిగి పూడ్చేశారు. పనులు నత్తనడకన సాగడంపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం పనులను గతంలో రూ.367 కోట్లతో మొదలుపెట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంచనా వ్యయాన్ని 567.22 కోట్లకు సవరించారు. ఇప్పటి వరకూ 460 కోట్లు ఖర్చు చేశారు. రెండు ప్యాకేజీల కింద పనులు పూర్తి చేయాల్సిన గుత్తేదారు సంస్థ దివాలా తీయడంతో ఏడాదిన్నరగా పనులు ఆగిపోయాయి. మిగిలిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. కుడి, ఎడమ కాల్వల పనులు పూర్తైతే.. దేవరకద్ర, సీసీకుంట, ధన్వాడ, కోయిల్‌కొండ, మక్తల్, నర్వ మండలాల్లోని 72 గ్రామాల్లో 50వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఇవీ చూడండి..