famous fish curry at Jurala project: జల సవ్వళ్లు.. ప్రకృతి సోయగాలు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు అందాలను మాటల్లో వర్ణించలేం. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు జన సందోహం ఇంకా ఎక్కువగా ఉంటుంది. జురాలలో జల సౌందర్యమే కాదు ఘుమఘుమలాడే చేపలకూరలు సందర్శకులకు ఆహ్వానం పలుకుతాయి.
జురాల పర్యాటకుల కోసం మత్స్యకార కుటుంబాలు.. తాజా చేపలను నచ్చిన రీతిలో వండి ఇస్తారు. ఇష్టమైన మత్స్యాలను ఎంచుకుని వంట చేయించుకునే సౌలభ్యం ఇక్కడి ప్రత్యేకత. జురాలకు వస్తే ఆకలి ఎలా తీరుతుందనే సమస్యే లేదంటున్నారు పర్యాటకులు. పెద్ద హోటళ్లు లేకపోయినా తిండికి కొదవలేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నచ్చిన చేపలను వండించుకొని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు.
జూరాల ప్రాజెక్టు వద్ద 200పైగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒక్కొ మత్స్యకారుడు రోజుకు 6 నుంచి 20 కిలోల చేపలు పడుతూ ఉంటారు. జూరాల ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద.. వరుసగా చిన్న చిన్న హోటళ్లు ఉంటాయి. ఈ హోటళ్లకు పైభాగంలో.. డ్యాముకు ఎడమవైపున చేపలు విక్రయిస్తున్నారు. అప్పుడే తాజాగా పట్టుకొచ్చిన చేపలను అమ్ముతుంటారు.
పర్యాటకులు వాటిని కొనుగోలు చేసి హోటళ్ల వాళ్లకు ఇస్తారు. కొద్ది నిమిషాల్లో చేప ఫ్రై, చేపల పులుసు రెడీ చేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాజెక్టులో దొరికే చేపల్ని తిని ఆనందిస్తున్నారు పర్యాటకులు. జూరాల చేప వంటకాల రుచే వేరని భోజన ప్రియులు చెబుతున్నారు. జల సవ్వడులు, పసందైన ఆహారం కోసం సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు జురాల పర్యటనకు తరలివస్తున్నారు.
ఇవీ చదవండి: