Jupalli Krishna Rao Criticized BRS Party: పాలమూరు జిల్లాలోని 14 స్థానాలు బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులే గెలుస్తాయని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చేశారు. పాలమూరు నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పు చేసినప్పుడు స్వపక్షమైన ప్రశ్నించే బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. మూడేళ్ల నుంచి తనకు సభ్యత్వ పుస్తకాలే ఇవ్వలేదు కదా.. మరి ఇంకెందుకు పార్టీ బాధ్యతలు ఇవ్వకుండా సస్పెండ్ చేశామని ఎలా అంటారని మండిపడ్డారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసిన నేతను తానే అని.. మరి తెలంగాణ వద్దన్న నేత వద్దకు వెళ్లి ఎలా సభ్యత్వం తీసుకోవాలో పార్టీనే చెప్పాలని జూపల్లి ప్రశ్నించారు. తనకు ప్రశ్నించే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలో గత ఎన్నికలో 14 స్థానాలకు గానూ.. 13 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. ఈసారి ఈ 14 సీట్లు బీఆర్ఎస్ వ్యతిరేక వర్గానికే వచ్చేందుకే కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఆనాడు ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించానని.. అందుకే రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యాయని మాజీ మంత్రి జూపల్లి తెలిపారు. కేసులతో నా అనుచరులను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌తో.. సహా అందరికీ చెప్పానని... అయినా ఏ ఒక్కరు పట్టించుకోలేదని ఆవేదన చెందారు. తనపై ఎన్ని దాడులు జరిగినా ఒక్కరిపైనా కేసు అనేది పెట్టలేదని పార్టీ తీరుపై మండిపడ్డారు. కాని తాను ఎక్కడ కనిపించినా.. కేసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేపు జరగబోయే శాసనసభ ఎన్నికలో బీఆర్ఎస్ను ఓడించడానికి కలిసి వచ్చిన పార్టీలు, నేతలు, సంస్థలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణను ఇంకా అప్పుడే స్పష్టంగా చెప్పలేమని.. అది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి పాలించేందుకు రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పించారని.. మూడోసారి పరిపాలించే నైతిక విలువలను కోల్పోయారని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.
"నా పోరాటం వల్లే వైఎస్సార్ విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. నా ఇంట్లో వైఎస్సార్ ఫోటో అప్పుడు ఉంది. ఇప్పుడు ఉంది. నా ఇంట్లో కేసీఆర్ ఫోటో కూడా ఉంది. మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. నేను ఓడిపోవడంలో కొందరు పెద్దల పాత్ర ఉంది. వారికి వచ్చే ఎన్నికల్లో వారికి జనమే బుద్ధి చెబుతారు. పాలమూరు జిల్లాలోని 14 స్థానాలు బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులే గెలుస్తాయి." - జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి
ఇవీ చదవండి: