మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పెద్ద రాజమూర్, నారాయణపేట జిల్లాలోని పూసలపాడు గ్రామం మధ్య ఉన్న ఇసుకను పూసలపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్లు అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాగులోకి ట్రాక్టర్లను దించారు. వాగుకు ఒక్కసారిగా వరద నీరు భారీగా రావడం వల్ల ట్రాక్టర్లు ఇరుక్కుపోయాయి. ఇక చేసేదేమి లేక ట్రాక్టర్లను డ్రైవర్లు అక్కడే వదిలివెళ్లారు.
అయితే కోయిల్ సాగర్ జలాశయానికి వరద నీరు అధికంగా రావడం వల్ల రెండు గేట్లు పైకెత్తి అధికారులు నీటిని కిందికి వదిలారు. దీంతో వాగుకు వరద నీరు భారీగా వస్తోంది. అది గమనించిన ట్రాక్టర్ డ్రైవర్లు, కూలీలు.. ట్రాక్టర్లను వదిలి వాగు బయటికి వెళ్లడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సాయంత్రం వరద తగ్గటం వల్ల గేట్లు మూసిన అనంతరం.. తోటి ట్రాక్టర్ల సాయంతో వాగులో ఇరుక్కుపోయిన ట్రాక్టర్లను పైకితీసుకొచ్చారు. వాగులో నీరు ప్రవహిస్తుండగా ఇసుకను అక్రమంగా తరలించేందుకు ట్రాక్టర్ యజమానులు చేసిన ప్రయత్నం వరద నీరు రావడం వల్ల బెడిసికొట్టింది. సంఘటన సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం