మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో లాక్ డౌన్ సడలింపు సమయంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ద్విచక్ర వాహనాలు, ఆటోలతో పాటు జాతీయ రహదారిపై వెళ్లే భారీ వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం, దానికితోడు రైల్వే గేట్ ఉండటంతో దేవరకద్ర పట్టణంలో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా మారింది.
భుజంపై మోసుకుంటూ ...
ఇదే సమయంలో మరికల్ నుంచి అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని కుటుంబ సభ్యులు కారులో జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు.
వాహనాలు ఎక్కువ ఉండటంతో దేవరకద్ర గేట్ కిలోమీటర్ దూరంలో కారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న భార్యని దక్కించుకోవాలనే ఆకాంక్షతో భర్త భుజాలపై వేసుకొని ట్రాఫిక్ దాటి అవతల వైపున ఉన్న 108 లో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు బంధువులు తెలిపారు. ఇప్పటికైనా సడలింపు వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను అధికారులు పరిష్కరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.