మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మండలం వ్యాప్తంగా ఉదయం 8 గంటల వరకు 45 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. వరుసగా నాలుగు రోజులు మార్కెట్కు సెలవులు రావడం వల్ల పంటను తీసుకొచ్చిన రైతులు మార్కెట్ ఆవరణలోనే ధాన్యం ఎండబెట్టుకున్నారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతులు లేచేసరికి ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ఆరబెట్టిన ధాన్యం తీసుకునే సమయం లేదని.. వర్షపు నీటిలో చాలావరకు కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటను విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాం. నాలుగురోజులుగా మార్కెట్ సెలవు వల్ల ఇక్కడే ఆరబెట్టుకున్నాం. తెల్లవారుజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ధాన్యం పోగుజేసుకునే సమయం కూడా లేదు. జోరు వానకు ధాన్యం కొట్టుకుపోయింది. పంట అంతా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి . - రైతులు
పంట చేతికొచ్చిందన్న సంతోషం... చేతిలో డబ్బు పడకముందే నీటిపాలైంది. తినే అన్నం పళ్లెంలో మట్టి కొట్టినట్లు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. పంటకు నీరు లేకపోతే చెమట చిందించి పుడమిని తడిపిన రైతు.. వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న పంటను చూసి చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. తాను నిద్రలోంచి మేల్కొనే సరికే నీటి ప్రవాహంతో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి గుండె చెరువయ్యింది. తనకీ పరిస్థితికి మార్కెట్కు వరుసగా వచ్చిన సెలవుల కారణమా... తమపై పగబట్టిన వరుణుడి ప్రకోపమా..? ఎవరిని నిందించాలో తెలియక తన దుస్థితిని చూసి ప్రభుత్వమే సాయం చేయాలని అన్నదాత వేడుకుంటున్నాడు.
ఇదీ చూడండి: అకాలవర్షం.. చేతికందిన ధాన్యం నీటి పాలు