ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో...
మహబూబ్‌నగర్ జిల్లాలోని చెరువులు, కుంటలు నిండగా... వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కలెక్టరేట్ కార్యాలయం ముందు, బస్టాండ్ ఆవరణలో భారీగా నీరు వచ్చి చేరటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పురపాలక, రెవెన్యూ, పోలీస్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో...
నాగర్ కర్నూలు జిల్లాలో చెరువులు కుంటలు అలుగులు పారుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో రెండు వైపుల నుంచి అలుగు పారుతుంది. చెరువులోని ఎండబెట్ల రోడ్డు పైనుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో ఓ శునకం చిక్కుకోగా... జేసీబీ సాయంతో అరగంట పాటు కష్టపడి రక్షించారు. కొల్లాపూర్ మండలం కుడికిల్లలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రేకుల ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో దేవమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో చాలా ఇళ్లు కూలిపోవడం, మరికొన్ని కూలడానికి సిద్ధంగా ఉండటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
డిండి వాగులో చిక్కుకున్న దంపతులు...
అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు డిండి వాగులో చిక్కుకుపోయారు. పొలానికి వెళ్లిన వెంకట్ రాములు, విజ్జి... వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అక్కడే ఉండిపోయారు. చుట్టూ నీటి ప్రవాహం ఎక్కువ కావటం వల్ల మధ్యలోనే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి హుటాహుటిన జిల్లా కలెక్టర్ శర్మన్ బయల్దేరారు. చిక్కుకున్న భార్యభార్తలను కాపాడేందుకు అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయం కోరారు. సీఎం, సీఎస్‌లతో మాట్లాడి వారిని రెస్క్యూ చేయడానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు హెలికాప్టర్ సాయం కోరినట్లుగా సమాచారం.
100 ఎకరాలు నీటిపాలు..
వీపనగండ్ల మండలంలో తూంకుంట వాగు, బీమా కాలువ కేఎల్ఐ కాలువలు తెగిపోవటం వల్ల దాదాపు 50 ఎకరాల వరి, వేరుశనగ పంట నీట మునిగింది. మండలవ్యాప్తంగా దాదాపు 100 ఎకరాలకు పంట నష్టం వాటినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడేర్ మండలంలో రాజాపూర్‌లో 2 ఇళ్లు కూలిపోయాయి. ముత్తిరెడ్డిపల్లిలో పొలంలో ఉన్న 2 ట్రాక్టర్లు వరదలకు కొట్టుకుపోయాయి.
వనపర్తి జిల్లాలో...
వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగసముద్రం జలాశయం నిండగా... పెబ్బేరు మండలం నగరాల గ్రామం ముంపునకు గురైంది. అధికారులు స్పందించి పునరావాసం కల్పించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. వనపర్తి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరటం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నాలాలపై అక్రమ కట్టడాలు చేపట్టటం వల్లే వర్షపు నీరు ఇళ్లల్లోకి వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
ఇదీ చూడండి: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జలమయమైన రోడ్లు