ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా(Union Mahabubnagar)లో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల (Rains) కారణంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం దుందుభి వాగు ప్రవాహం కారణంగా సూరారం- ఉడిత్యాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నచింతకుంట మండలం సీతారాం పేట వద్ద మన్నెవాగు పొంగుతోంది.
కలెక్టర్ తనిఖీ...
భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని రామయ్య బౌలి, వేపూరుగేరిలో ఆకస్మిక తనిఖీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని... వర్షానికి సంబంధించిన ఏ సమాచారం అయినా కలెక్టర్ కంట్రోల్ రూం నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అధికారుల అప్రమత్తం...
భారీవర్షాల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్ల నుంచి జనాన్ని ఇతర నివాస సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
నిర్విరామంగా కురుస్తున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ విజ్ఞప్తి చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, మండల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, కూలిన ఇళ్లు, తెగిన చెరువులు, వాగులు, వంకలు, రహదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టం నివేదికలను ఎప్పటికప్పడు తయారు చేసి అందించాలన్నారు. అల్మట్టి, నారాయణపూర్ డ్యాం నుంచి వరద జూరాలకు చేరుతున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాలను పోలీసు, రెవిన్యూ యంత్రాంగం అప్రమత్తం చేశారు.
రాకపోకలు కట్...
నారాయణపేట జిల్లా నర్వ మండలం కొత్తపల్లి, పెద్దకడమూర్ మధ్య నున్నవాగు పోటెత్తడం వల్ల కొత్తపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో నార్లాపూర్ పెద్దవాగు, ముక్కిడిగుండం, ఉడుములవాగు పొంగిపొర్లుతున్నాయి. ముక్కిడి గుండం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పునుంతల, వంగూర్ మండలాల మధ్య దుందుబీ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల రహదారిపై నుంచి వరద పారుతోంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అప్పరాల, పామాపురం, కనిమెట్ట సమీపంలో ఉన్న ఊకచెట్టు వాగు పారుతోంది. అప్పరాల నుంచి తిప్పుడంపల్లి, ఆత్మకూర్‌కు వెళ్లే దారిలో రాకపోకలు ఆగిపోయాయి.
సంబంధిత కథనాలు: