Beggar feeds Baby: మహబూబ్‌నగర్ జిల్లా సదాశివపేట- జహీరాబాద్ రహదారిలోని ఆత్మకూరు చౌరస్తా... మంగళవారం మిట్టమధ్యాహ్నం.. మండుటెండతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎనిమిదేళ్ల బాలిక సురేఖ చంకలో నెలల పసికందు వెక్కివెక్కి ఏడుస్తోంది. సురేఖ కూడా ఆకలితో ఉందేమో.. అందుకే తన చెల్లెలు ఆకలితో ఏడుస్తోందని గుర్తించింది. అందుకే పాపను చంకలో ఎత్తుకొని దారిన వచ్చిపోయే వారిని బతిమాలుతోంది. 'మా చెల్లెలు ఆకలితో ఏడుస్తోంది.. పాలు కావాలి.. కొంచెం సాయం చేయండయ్యా..' అంటూ వేడుకుంటోంది. ఆ పసికందు ఏడుపు, ఆ చిన్నారి బాధను గమనించి దారిన పోయేవాళ్లు.. తమకు తోచిన సాయం చేస్తున్నారు.
ఈ సన్నివేశాన్ని గమనించిన 'ఈనాడు- ఈటీవీ భారత్' ప్రతినిధి 'ఎందుకమ్మా.. ఇలా చేస్తున్నావ'ని బాలికను అడగ్గా మద్యానికి బానిసైన తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చింది. తాము సదాశివపేటలో చెరువు పక్క గుడిసెల్లో ఉంటామని సురేఖ చెప్పింది. రెండు రోజుల క్రితం అమ్మను నాన్న కొట్టడంతో ఎక్కడికో వెళ్లిపోయిందని వెల్లడించింది. నాన్న పట్టించుకోకపోవడం, చెల్లెలు ఆకలితో ఏడుస్తుండటంతో ఏం చేయాలో తోచక ఇలా అడుక్కుంటున్నానని వాపోయింది.
అదే సమయంలో అక్కడున్న యాచకురాలు ఎల్లమ్మ.. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు బాధను చూసి తల్లడిల్లింది. వెంటనే ఎల్లమ్మ స్పందించి.. చెట్టుకిందకు తీసుకెళ్లి ఆ బిడ్డకు కడుపునిండా పాలిచ్చింది. వీళ్లు తమ గుడిసెల పక్కనే ఉంటారని, తల్లి వెళ్లిపోవడం, తండ్రి వదిలేయడంతో ఆకలితో అల్లాడుతున్నారని వివరించింది.
వెంటనే ‘ఈనాడు- ఈటీవీ భారత్’ ప్రతినిధి.. ఈ విషయాన్ని శిశుసంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు తక్షణం స్పందించారు. పిల్లలున్న చోటకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక వారికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. మద్యానికి బానిసై పిల్లలను నిర్లక్ష్యం చేసిన రమేష్‌కు ఇద్దరు భార్యలున్నారని వారికి ఐదుగురు పిల్లలున్నట్లు గుర్తించారు. పెద్దభార్య చనిపోగా, చిన్నభార్య పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయిందని తేల్చారు. ప్రస్తుతం ఈ పిల్లలంతా శిశుగృహలో ఉన్నారు.
ఇవీ చదవండి: లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు దాడి.. మామ మృతి.. రహస్య వీడియోలు వైరల్..
స్ట్రెచర్‌పై పడుకునే ఎగ్జామ్ రాసిన విద్యార్థి- ఏం డెడికేషన్ గురూ!