ETV Bharat / state

Gandhi Trust: 67 ఏళ్ల స్వాతంత్ర్య సమర యోధుల ఆశయం.. కళ్ల ముందే అన్యాక్రాంతం - సర్వోదయ ఆశ్రమం

గాంధీ ఆశయాల సాధన కోసం వారంతా ఒక్కటయ్యారు. జాతిపిత పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి సేవకు కదిలారు. 30 ఎకరాల భూమిని పోగు చేసి సర్వోదయ ఆశ్రమం పేరుతో ప్రజలకు సేవ చేయాలని భావించారు. అందుకు కావాల్సిన సంపద సృష్టి కోసం పకడ్బందీ ప్రణాళిక రచించారు. కానీ.. ఆరు దశాబ్దాలు గడిచినా వారి లక్ష్యం నెరవేరలేదు. 30 ఎకరాలు ఇప్పటికే అమ్మేసినా.. ఆశ్రమం మాత్రం నిర్మాణం కాలేదు. గాంధీ ట్రస్టు పేరిట కనీసం బోర్డు కూడా లేదు. ట్రస్టు సభ్యుల ఇష్టారాజ్యం, రాజకీయ ప్రమేయం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోట్ల విలువైన భూములు.. చౌక ధరలకు పరులపాలవుతున్నాయి. ఆదాయం పేరిట అమ్మకాలు తప్ప అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో వివాదాస్పమవుతున్న కోట్ల విలువైన గాంధీ ట్రస్టు భూములపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

gandhi trust lands Occupied from 67 years in jadcharla

author img

By

Published : Aug 14, 2021, 6:41 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నడిబొడ్డున కోట్లు విలువ చేసే గాంధీ ట్రస్టు భూములు క్రమంగా కనుమరుగవుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. గాంధీజీ ఆశయ సాధన కోసం 1954లో మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన 9 మంది స్వాతంత్ర్య సమరయోధులు గాంధీ ట్రస్టు స్థాపించారు. సొంత నిధులు, స్థానికుల సహకారంతో ట్రస్టు పేరిట 30.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నంబర్లు 67, 228, 273లో ట్రస్టు భూమి ఉంది. ఈ భూమిని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఇండ్ల స్థలాలుగా మార్చి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో సుమారు 12 ఎకరాల్లో సర్వోదయ ఆశ్రమాన్ని నిర్మించాలని భావించారు. ఆశ్రమాన్ని నడిపేందుకు అవసరమైన ఆదాయాన్ని క్రమం తప్పకుండా పొందేందుకు ప్రధాన రహదారికి ఆనుకుని దుకాణ సముదాయం నిర్మించాలని ప్రణాళిక రచించారు. గ్రంథాలయం, సామాజిక భవనం, గాంధీ భవనం, ఉచిత వైద్యశాల ఇలా పలు కార్యక్రమాలు చేపట్టాలన్నది స్వతంత్ర సమరయోధుల ప్రధాన లక్ష్యం. 60 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్ల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. 30 ఎకరాల భూమిలో 15000 గజాలు మాత్రమే మిగలగా... ఉన్న 10 వేల గజాల భూమిని అమ్మేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక ట్రస్టుకి మిగిలింది కేవలం 5వేల గజాలే.

60 ఏళ్లలో రూ. 90 లక్షలే..

స్వతంత్ర సమరయోధుల తర్వాత 60 ఏళ్లలో ట్రస్టు కన్వీనర్లు, సభ్యులమంటూ ఎంతోమంది చలామణి అయ్యారు. ఎవరొచ్చినా ఇండ్ల స్థలాల అమ్మకాలపై దృష్టి సారించారే.. తప్ప సర్వోదయ ఆశ్రమ నిర్మాణంవైపు అడుగు ముందుకు వేయలేదు. పైగా 60 ఏళ్లలో ఇండ్ల స్థలాలు అమ్మగా వచ్చిన డబ్బు కేవలం రూ. 90 లక్షలు మాత్రమేనని ట్రస్టు సభ్యులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ట్రస్టు భూములు ఉన్నది జడ్చర్ల పట్టణం నడిబొడ్డున. పైగా జాతీయ రహదారికి ఆనుకునే. ఆది నుంచి ఆ భూములకు డిమాండ్ ఎక్కువే. ప్రస్తుతం గజానికి 25వేల నుంచి 50వేల వరకు పలుకుతోంది. అలాంటి భూముల్ని అమ్మితే కేవలం 90 లక్షలు మాత్రమే వచ్చాయనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్వార్థ ప్రయోజనాల కోసమే చౌకధరలకు..

ట్రస్టు నిర్వాహణలోనూ గత, ప్రస్తుత పాలక వర్గాలు నిబంధనలకు తూట్లు పొడిచి కోట్లు గడిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులే సభ్యులుగా కొనసాగడం, వారి స్వార్థ ప్రయోజనాల కోసం కోట్లు విలువైన భూముల్ని చౌకధరలకు అస్మదీయులకు, బినామీలకు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అన్యాక్రాంతం అయ్యేందుకు సైతం ట్రస్టు సభ్యులే సహకరిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

ఆరోపణల్లో నిజం లేదు..

ట్రస్టు సభ్యులు మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం 15000 గజాలు ట్రస్టు పేరిట ఉందని వాటిలో 10వేల గజాలు ఇండ్లస్థలాలుగా మార్చి అమ్మి, వచ్చిన డబ్బుతో 5 వేల గజాల్లో సర్వోదయ ఆశ్రమాన్ని నిర్మిస్తామని ట్రస్టు ఛైర్మన్ తెలిపారు.

ఇప్పటికైనా స్పందించాలి...

కోట్లు విలువ చేసే గాంధీ ట్రస్టు భూముల వ్యవహారం ఏళ్లుగా వివాదాస్పదమవుతున్నా... జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదులు వెళ్లినా.. చర్యలకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి.. గాంధీ ట్రస్టు పేరిట మిగిలి ఉన్న భూమిని, డబ్బుని స్వాధీనం చేసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Jagtial News : రాత్రంతా శవానికి పూజలు.. ఇక బతికిరాడని చివరికి ఏం చేశారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.