Food Park: రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఆహార శుద్ధి పరిశ్రమలకు సమీకృత విధానాన్ని ప్రకటించింది. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు హన్వాడ మండల కేంద్రంలో అనుకూలంగా ఉంటుందని భూములు గుర్తించారు. 718 సర్వే నంబర్‌లో 3,100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2,177 ఎకరాలు అటవీశాఖకు సంబంధించినది. మిగతాది ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. 50ఏళ్ల క్రితమే ఈ సర్వే నంబర్‌లో కొంత భాగాన్ని అధికారులు అసైన్‌మెంట్ కింద దళిత, బీసీ రైతులకు కేటాయించారు. ఇప్పటికే పట్టా పొందిన పలువురు రైతులు సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఆగమేఘాల మీద 244 ఎకరాలు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం, వాటిని వెంటనే టీఎస్ఐఐసీకి అప్పగించడంతో సమస్య మొదలైంది. యంత్రాలను తీసుకొచ్చి పని ప్రారంభించడంతో సమస్య మరింత జఠిలమైంది. గుట్టలుగా ఉన్న భూములను చదును చేసుకుని సాగు చేసుకుంటున్నామని ఎసైన్డ్ భూములు పొందిన రైతులు నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. దీనిపై కొందరు రైతులు ఉన్నత న్యాయస్థానం మెట్లెక్కగా.. రైతుల సమ్మతితోనే భూ సేకరణ జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో హన్వాడకు చెందిన రైతు బొక్కి చిన్న మాసయ్య రాజ్యసభ బరిలో దిగాడు. మాసయ్యకు 718 సర్వే నంబర్‌లో 1.17 ఎకరాల సాగు భూమి ఉంది. పరిశ్రమ ఏర్పాటులో తన భూమి కోల్పోతుండటంతో నిరసనగా.. రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసినట్లు ఆయన వెల్లడించారు. రైతులకు సాగుభూమితోపాటు 100 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయించినా.. మొదట భూమి ఇచ్చాకే పనులు ప్రారంభించాలని ఆందోళనలు చేపట్టడంతో సమస్య ఉత్పన్నమైందని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్ దిల్లీకి వస్తాడనే భయంతోనే విషం చిమ్ముతున్నారు: జగదీశ్ రెడ్డి