మహబూబ్‌నగర్ జిల్లాలో చేప పిల్లల పంపిణీకి మత్య్సశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. దాదాపు 80 శాతం చెరువుల్లోకి నీరు రావడం వల్ల ఆగస్టు 5 నుంచి వాటిని వదిలిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,202 నీటి ట్యాంకులున్నాయి. ప్రస్తుత వానాకాలంలో 2,42,84,000 చేప పిల్లలు పంపిణీకి చేయనున్నారు.
చిన్న నీటి వనరుల్లో 30శాతం కట్ల, 30 శాతం రోహూ, 35 శాతం బంగారుతీగ వంటి రకాలు వదలనున్నారు. ఇక పెద్దచెరువుల్లో 40 శాతం కట్ల, 50 శాతం రోహూ, 10 మృగాల వంటి రకాలు వదలనున్నారు. వీటిని కైకలూరు, భీమవరం నుంచి తీసుకొస్తున్నారు. వీటిని చెరువుల్లో వదలాలంటే ముందుగా పంచాయతీలు, మత్య్ససహకార సంఘాలు ప్రత్యేక తీర్మానాలు చేసి జిల్లా కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక సంఘాలు జిల్లా మత్య్సశాఖ కార్యాలయానికి తీర్మానాలు పంపించాయి.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఆగస్టు 5న చెరువుల్లో వదలనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 6న వచ్చే అవకాశం ఉంది. ఆయన దేవరకద్ర మండలం మదిగట్లకు రానున్నారు. గతేడాది నీరు లేక 505 చెరువుల్లో కోటీ 34 లక్షల చేప పిల్లలను వదిలారు. అందులో 8,950 మెట్రిక్ టన్నుల చేప ఉత్పత్తులను మత్య్సకారులు అమ్ముకున్నారు.
ఈ ఏడాది వదిలిన చేపల్లో 50 శాతం బతికినా దాదాపు 25 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను సాధించే వీలుంది. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడం వల్ల వాటిని త్వరగా వదిలితే ఎక్కువ ఉత్త్పత్తులు పొందవచ్చని మత్య్సకారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్