రైతుబంధు సాయం అందక మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తున్నట్లు ప్రకటించినా... ఇంకా కొందరు రైతుల ఖాతాల్లో జమకాలేదు. తమ డబ్బులు వస్తాయా... రావా... అనే సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారు.
2019 ఖరీఫ్ పూర్తయింది. యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 26 వేల 469 మంది రైతులకు ఇంకా రైతుబంధు డబ్బులు అందలేదు. ఈ మొత్తం రూ.66 కోట్ల వరకు ఉంటుంది. రెండు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన మంత్రి నిరంజన్‌రెడ్డి వారం రోజుల్లో డబ్బులు వస్తాయని చెప్పినప్పటికీ ఇప్పటికీ రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా... జాబితా పంపడం వరకే తమ బాధ్యతని, డబ్బులు పడటం అనేది తమ చేతిలో లేదని అధికారులు చెబుతున్నారు.
గతేడాది సాయమూ అందలే...
2018 రబీలో ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు సాయం.. జిల్లాలో కొందరికి రాలేదు. అప్పట్లో సాయం డబ్బులు నిలిచిపోయాయి. అప్పటినుంచి ఆ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తునే ఉన్నారు. 2018 రబీకి సంబంధించి 879 మంది రైతులకు కోటీ రూపాయల వరకూ సాయం అందాల్సి ఉంది. జిల్లా నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సరిచేసి పంపించినప్పటికీ... ఇంతవరకూ డబ్బులు మాత్రం రాలేదని ఆందోళన చెందుతున్నారు. పైసల కోసం ఇప్పటికే ప్రజావాణి ఫిర్యాదు చేశారు. పాసు పుస్తకాలు లేకపోవడం వల్ల రైతుబంధు సహాయానికి అనర్హులుగా ఉండి పోతున్నామని వాపోతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య | 2,26,470 |
ఖరీఫ్‌లో రైతుబంధు అందుకున్నవారు | 2,00,001 |
మిగిలిపోయిన వారు | 26,469 |
జిల్లాకు మంజూరైన నిధులు | రూ. 336,91,62,735 |
రైతుల ఖాతాల్లో జమ అయినవి | 269,93,70,320 |
ఇంకా రైతులకు రావాల్సిన డబ్బులు | 66,97,92,415 |
వారంరోజుల్లో పడతాయని...
జిల్లాలో రైతుబంధు సాయం అందని రైతులకు డబ్బులు వారంరోజుల్లో పడొచ్చని జిల్లా వ్యవసాయాధికారి బైరెడ్డి సింగారెడ్డి పేర్కొన్నారు. జాబితాను పంపించినట్లు తెలిపారు. 2018కి సంబంధించిన వివరాలు సరిచేసి పంపించామని చెప్పారు. నిధులు రావాల్సి ఉందని.. రబీకి సంబంధించిన పెట్టుబడి సాయంపై స్పష్టమైన ఆదేశాలు రాలేదని అన్నారు. కాస్త ఆలస్యమైనప్పటికీ... రైతుబంధు అందరికీ అందుతుందని తెలిపారు.
ఇదీ చూడండి : అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు