Mahbubnagar Chilli farmers problems : జోగులాంబ గద్వాల జిల్లాలో మిరప పంట పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరిలో 25వేలు పలికిన ఎండు మిరప ధర, ప్రస్తుతం 15 నుంచి 18వేలు పలుకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, తెగుళ్లదాడితో నష్టాల్లో ఉన్న తమకు. మార్కెట్ ధరలు శాపంగా మారయాంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి.. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఏటా సుమారు 25వేల మంది రైతులు 36వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తారు. ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులన్నీ కలిపి ఎకరాకు లక్ష రూపాయలకు పైగానే పెట్టుబడి పెట్టారు. గత సంవత్సరం ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన మిరప..తామరపురుగు, ఆకుముడత తెగుళ్ల కారణంగా ఎకరాకు 2 నుంచి 10 క్వింటాళ్లకే పరిమితమైంది.జనవరిలో సూపరైన్ వంటి మిరపపంటకు మార్కేట్లో 26 వేలు పలకడంతో.. దిగుబడి తగ్గినా ధర బాగానే ఉందని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కి 15 నుంచి 18 వేలకు తగ్గింది. ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా చేతికి రావని అంటున్నారు మిరప రైతులు.
మధ్యదళారులకే పంట అమ్ముకునే పరిస్థితి.. " మిరపను అమ్మాలంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మార్కెట్ సౌకర్యం లేదు. వెళ్తే గుంటూరు లేదంటే హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, హూబ్లీ లాంటి మార్కెట్లకు వెళ్లాలి. రవాణా ఖర్చులు, మార్కెట్ కమిషన్లు, తూకంలో మోసాలు, ఇతర ఖర్చుల భారం భరించలేక మధ్యదళారులకే పంట అమ్ముకునే దుస్థితి." - మహబూబ్ పాషా, రైతు
మార్కెట్ యార్డు ఉన్నా అమ్మే అవకాశం లేక.. తక్కువ ధరకు పంట అమ్ముకునేందుకు ఇష్టపడని రైతులు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతున్నారు. రవాణా ఛార్జీలు సహా నిల్వ కోసం క్వింటాకు 160 నుంచి 200 రూపాయలు ఖర్చు చేయాలి. 11 నెలల్లోపు నిల్వ చేసిన పంట అమ్ముకోకపోతే.. మరో ఏడాదికి రైతులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు తిరిగా రాక, చేసిన అప్పులను తీర్చుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో , అలంపూర్ చౌరస్తా, అయిజలో మార్కెట్ యార్డు సదుపాయం ఉన్నా.. మిరప విక్రయించేందుకు అవకాశం లేకపోవడం రైతులకు శాపంగా మారింది.
ఇదీ చూడండి..