ఆ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో వరద ఉద్ధృతి పెరిగితే కరెంటు ఉత్పత్తి తగ్గిపోతోంది. కృష్ణానదిపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఎగువ, దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి(jurala power plant)కేంద్రాల్లో... వేల మిలియన్ యూనిట్లను నష్టపోవాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రానికి బ్యారేజీ గేట్ల నుంచి ఉద్ధృతంగా విడుదలయ్యే నీరు ఆటంకంగా మారుతోంది.
విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే నీరు సులువుగా నదీమార్గంలో వెళ్లిపోవడానికి వీల్లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతోంది. వనపర్తి జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాల మధ్య కృష్ణానదిపై కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం అధ్యయనం చేపట్టిన నేపథ్యంలో దీనికి ఎగువన ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలపై నీటి ఒత్తిడి అంశం తెరపైకి వచ్చింది.
కృష్ణా నదిపై జూరాల బ్యారేజీకి 7.90 కిలోమీటర్ల దిగువన గుండాల జలపాతం సమీపంలో దిగువ జూరాల పవర్‌హౌస్ ఉంది. 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు యూనిట్లను రూ.1800 కోట్ల వ్యయంతో ఇక్కడ నిర్మించగా 2016 నుంచి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఒక్కో యూనిట్ నడిచేందుకు 8000 క్యూసెక్కుల ప్రవాహం అవసరం 22 మీటర్ల ఎత్తు నుంచి నీటి ప్రవాహం దూకిన సమయంలోనే గరిష్ఠ విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది.
అనంతరం ఆ నీరు దిగువనున్న టెయిల్‌రేస్ కాల్వ ద్వారా నదిలోకి చేరాల్సి ఉంటుంది. ఈ కేంద్రం క్రస్టు లెవల్ 299 మీటర్లు. దానికి 12 కిలోమీటర్ల దిగువన ఉన్న బీచుపల్లి వరకు శ్రీశైలం వెనుక జలాలు(పూర్తిస్థాయి మట్టం ఉన్నప్పుడు) నిలిచి ఉంటున్నాయి. ఎగువ నుంచి వచ్చే ప్రవాహానికి ఇవి అడ్డంకిగా మారి, దిగువ జూరాల విద్యుత్ కేంద్రం వద్ద కృష్ణానది ప్రవాహం నెమ్మదించి విద్యుదుత్పత్తి పడిపోతోంది.
నదిలో 3,00,000 క్యూసెక్కుల ప్రవాహం దాటితే విద్యుదుత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. గత ఐదేళ్లలో పలుమార్లు ఇలా ఆటంకాలు తలెత్తాయి. కాలువ ప్రవాహం, నదీజలాల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాలపై జెన్కో ఒక సంస్థతో అధ్యయనం చేయించింది. టెయిల్‌రేస్ కాల్వను పొడిగించి దిగువన నదిలో కలిపేలా నిర్మాణం చేపట్టడానికి బండరాళ్లు, ఇతర ఇబ్బందులు ఉన్నట్లు ఆ సంస్థ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ప్రస్తావించినట్లు జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి.
39 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు జూరాల బ్యారేజీ వద్ద ఉన్నాయి. ఈ జలాశయం క్రస్టు 311.65 మీటర్ల స్థాయితో గరిష్ఠంగా 21.4 మీటర్ల ఎత్తు నుంచి టర్బైన్లపై నీళ్లు దూకిన సమయంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. కనిష్ఠంగా 9 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు దూకినా ఉత్పత్తి సాధ్యమవుతోంది. బ్యారేజీ నిండాక ఈ కేంద్రం పక్క నుంచే బ్యారేజీ క్రస్టు గేట్ల ద్వారా వరద దిగువన నదిలోకి వెళ్తోంది. ఆ సమయంలో టెయిల్‌రేస్ కాల్వ నుంచి వచ్చే నీటికి వరద అడ్డంకిగా మారి ప్రవాహం నెమ్మదిస్తోంది. ఫలితంగా ఒత్తిడి పెరిగి ఉత్పత్తి తగ్గిపోతోంది.
ఆరు యూనిట్ల ద్వారా గరిష్ఠంగా 234 మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన చోట ఒక్కోసారి 12 లేదా 13 మెగావాట్లకు పడిపోతోంది. కాలువను దిగువన మరికొంత దూరం వరకు పొడిగించి నదిలో కలపాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. ఏటా వరద వృథాగా దిగువకు పోతున్నా విద్యుత్ కేంద్రం సామర్థ్యం మేరకు నడవలేని పరిస్థితిలో ఉండిపోతోంది.
ఇదీ చూడండి: CM KCR: ఎల్లుండి సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం