పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఒక్కో నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని.. వారు పెట్టిన ఖర్చును చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఓటింగ్ శాతం చూస్తే నైతికంగా ఓడిపోయినట్టేనని వెల్లడించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన ఎన్నికలు కావడంతో పట్టభద్రులను ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నం లేదని విమర్శించారు.
భాజపా పోరాటంతోనే... తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించిందని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించని సంఘాలు.. ఇవాళ రోడ్లపై డాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన 12 నెలల ఎరియర్స్‌ను పదవి విరమణ తర్వాత ఇస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ వయసు పెంపుతో రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ఆగిపోయిందని... దీనివల్ల నిరుద్యోగం మరింత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి: థియేటర్ల మూసివేతపై స్పష్టతనిచ్చిన మంత్రి తలసాని