DK Aruna Comments on Migration in Palamuru : పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్, కేటీఆర్ చేసింది శూన్యమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలమూరు జిల్లాకు ఏ రంగంలోనూ ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
జూరాల నుంచి పాలమారు-రంగారెడ్డిని చేపట్టి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలో అసంపూర్తి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు తెలంగాణలో జరిగే ఎన్నికలకు సంబంధమే లేదని పునరుద్ఘాటించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం ఏ మాత్రం తగ్గలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభావం తగ్గిందనేది దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చేస్తున్న భూటకపు ప్రచారమని ఆరోపించారు. కేంద్రం నిధులు లేకుండా తెలంగాణలో గ్రామాల్లో, పట్టణాల్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి కేంద్రం ఏమి చేసిందో 'మహాజన్ సంపర్క్' యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. జులై 5వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఎరువులపై రాయితీ, కిసాన్ సమ్మాన్ నిధి అంతా కలిపి ఎకరాకు రూ.25వేల వరకూ కేంద్రం ద్వారా లబ్ది చేకూరుతోందని వివరించారు. వరి సహా అన్ని పంటలకు మద్దతు ధరలు పెంచడం ద్వారా రైతులకు కేంద్రం అండగా నిలుస్తోందని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ పట్టణానికి అమృత్ పథకం ద్వారా, మయూరీ పార్క్‌కు కంపా పథకం ద్వారా కేంద్ర విడుదల చేసిన నిధులే ఖర్చు చేశారన్నారు.
వలసలు ఎక్కడ ఆగిపోయాయో చూపించాలి: గతవారంలో పాలమూరు జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్ అని ఇప్పుడు పాలమూరు అంటే ఇరిగేషన్ అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ సైతం.. వలసలకు పేరొందిన ఈ జిల్లా తెలంగాణ ఏర్పడిన తరువాత బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా డీకే అరుణ స్పందించారు. పాలమూరు జిల్లాలో వలసలు ఎక్కడ ఆగిపోయాయో తండ్రీ, కుమారులు చూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప పాలమూరుకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.
ఇవీ చదవండి: