ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే జర్నలిస్టులను (Journalist) కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister srinivas goud) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ ఉన్నత పాఠశాలలో జర్నలిస్టులకు టీకాలిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు.
చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకుంటోందని గుర్తుచేశారు. జర్నలిస్ట్ కుటుంబాలలో ఏవైనా సమస్యలు వస్తే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని , అనారోగ్యం పాలైతే వారిని ఎలాగైనా బతికించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదనే విషయం జర్నలిస్టులకు తెలుసని అభిప్రాయపడ్డారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేకించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలు వస్తే ఇంటికి వెళ్లి కూడా సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైతే శాంత నారాయణ్ గౌడ్ ట్రస్ట్ ద్వారా భోజనం కూడా పంపిస్తామన్నారు. జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండి విధులు నిర్వహించాలని ఆయన కోరారు.