Fever Survey: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఫీవర్ సర్వేలో కరోనా బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షా 94 వేలు, వనపర్తి జిల్లాలో లక్షా 25వేలు, గద్వాల జిల్లాలో లక్షా 20వేలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో లక్షా 50వేలు, నారాయణపేట జిల్లాలో 80వేల ఇళ్లను ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలు సందర్శించాయి. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో చేపట్టిన ఈ సర్వేలో సుమారు 25వేల మందికి పైగా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వీరికి అక్కడికక్కడే ఐసోలేషన్ కిట్‌లు సైతం అందించారు. ఫీవర్ సర్వేలో ఎక్కువ మంది జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబుతో బాదపడుతున్నట్టుగా చెబుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు వెల్లడించారు. వంద మందిలో సుమారు 40 శాతం ఇళ్లలో జలుబు, దగ్గు లాంటి సామాన్య లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇందులో 20 శాతం మందికి తీవ్రంగా ఉండటంతో వెంటనే ఐసోలేషన్ కిట్‌లను అందజేసి పేర్లు నమోదు చేసుకుని పర్యవేక్షిస్తున్నారు. ఐసోలేషన్ కిట్‌లను వాడినా.. మూడు రోజుల వరకు జ్వరం, ఇతర లక్షణాలు తగ్గని వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల 21 నుంచి ఫీవర్ సర్వే చేపట్టడంతో వేల సంఖ్యలో లక్షణాలు ఉన్నవారు బయటపడుతుండగా.. ఆరోగ్య కార్యకర్తలు ఇచ్చే ఐసోలేషన్ కిట్‌ల ద్వారానే ఎక్కువ శాతం వరకు కోలుకుంటుండగా.. మిగిలిన వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.
వ్యాక్సినేషన్‌పై దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. 15 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నాలుగు జిల్లాలు మొదటి స్థానాలలో నిలిచాయి. ఇది వరకే మొదటి డోస్ 100 శాతం పూర్తి కాగా... రెండో డోస్ ఇంకా 30శాతం మిగిలిపోయింది. అటువంటి వారిని ఈ ఫీవర్ సర్వేలో గుర్తించి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వీరితో పాటు అర్హులైన వారికి బూస్టర్ డోస్ సైతం అందిస్తున్నారు.
జోరుగా కొవిడ్ పరీక్షలు
మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొవిడ్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా ఆసుపత్రుల నుంచి పీహెచ్‌సీల వరకు లక్షణాలు ఉన్నవారు పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. జనవరి మొదటి వారంలో ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం పది నుంచి పదిహేను శాతానికి పెరిగింది. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులలో కొవిడ్ పరీక్షల సంఖ్యను సైతం పెంచారు. లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫీవర్ సర్వేలో తీవ్ర లక్షణాలు ఉన్న వారికి కూడా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
హోంఐసోలేషన్ కిట్స్ అందిస్తున్నాం..
ప్రతి ఒక్క ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, రిసోర్స్ పర్సన్.. వాళ్లందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 7గంటలకు వరకు సర్వే జరుగుతుంది. రోజుకు 60 నుంచి 70 ఇళ్లవరకు కవర్ చేస్తున్నాం. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ర్యాపిడ్ టెస్ట్ కూడా చేస్తున్నాం. అందులో పాజిటివ్ వచ్చినవారికి హోంఐసోలేషన్ కిట్స్ అందిస్తున్నాం. ఎక్కువగా జలుబు, దగ్గు లాంటి సామాన్య లక్షణాలు కనిపిస్తున్నాయి. -మహేశ్వరి, వైద్యాధికారిణి
పెరుగుతున్న కరోనా కేసులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకవైపు ఫీవర్ సర్వే కొనసాగుతుండగా... మరోవైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నా.. జనం మాత్రం కనీసం నిబంధనలు పాటించడంలో విఫలమవుతున్నారు. ఎక్కడ కూడా మాస్కులు, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం లేదు. ఈ మధ్య శుభకార్యాలు సైతం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: