ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొవిడ్-19తో మంగళవారం ముగ్గురు మృతిచెందారు. మరో 8 మంది కరోనా బారినపడ్డారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మంగళవారంతో రెండొందలు దాటాయి. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కొల్లూరుకు చెందిన వ్యక్తికి కరోనాతో చనిపోయాడు. జడ్చర్లలోని కావేరమ్మపేట వెంకటేశ్వర కాలనీకి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకింది. మూసాపేట మండలం పోల్కంపల్లికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పనిచేసి గత నెల స్వస్థలానికి వచ్చారు.
వనపర్తిలో ఇద్దరు మహిళలు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒకరు కిరాణం దుకాణాన్ని నడుపుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరొకరు ఇటీవల పాజిటివ్ సోకిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులో ఉన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం బోగారం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. మక్తల్ మండలానికి చెందిన ఓ వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో మృతిచెందింది. ఈమెకు ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులోని జల్లాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్‌తో మృతిచెందారు. ఈయనకు జూన్ 23వ తేదీన కరోనా పాజిటివ్ సోకడంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మల్దకల్, అయిజ మండలాలకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ బంధువులు. అనుమానిత లక్షణాలతో హైదరాబాదులో పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలింది. వీరిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి పంపినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా కలవరం... కొత్తగా 945 మందికి పాజిటివ్