Due To No Rains Joint Mahbubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం సాగు.. వ్యవసాయ శాఖ అంచనాలను తలకిందులు చేసేలా ఉంది. సీజన్‌లో 18 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు భావించారు. కానీ ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటినా 10 శాతంలోనే విత్తనాలు పడ్డాయి. వర్షాభావ పరిస్థితులతో పత్తి రైతులకు అవస్థలు తప్పట్లేదు. జూన్‌లో కురిసిన ఒకటి, రెండు వర్షాలకు నాటిన విత్తనాలు మొలకెత్తకపోవటంతో రెండు, మూడు పర్యాయాలు విత్తుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు వరుణుడు మళ్లీ దోబూచులాడుతుండటంతో పంటను రక్షించుకోలేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరో పది రోజుల్లో వర్షాలు పడకపోతే వేసిన పత్తి పంట దక్కే పరిస్థితి లేదు. ఇప్పటికే పలు మార్లు విత్తనాలు వేసి నష్టపోయిన కర్షకులకు.. పంట ఆలస్యం మరింత వేధిస్తోంది. ఆలస్యం వల్ల దాదాపు 50 శాతం మేర దిగుబడులు తగ్గుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"జూన్ నెల నుంచి రెండు సార్లు విత్తనాలను వేశాం కానీ మొలకలు రాలేదు. ఈసారి వేసిన విత్తనాలకు మొలకలు వచ్చాయి. ఇప్పుడు కూడా వర్షాలు రాకపోతే వచ్చిన అవి కూడా వాడిపోతాయి. ఇది వరకు వేసిన పంటకు దాదాపు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు నష్టపోయాం." -బాధిత రైతులు
Cotton Farmer Problems : పాలమూరులో పత్తి తర్వాత అధికంగా సాగయ్యేది వరి పంట. 6 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా కేవలం 6,000 ఎకరాలలోపే నారుమళ్లు వేశారు. జూన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే భూగర్భ జలాలు పెరిగి జులై నాటికి వరి విస్తృతంగా సాగయ్యేది. జూరాల ప్రాజెక్టుకు సైతం నీటి ప్రవాహం లేకపోవటంతో కృష్ణా నది మీద ఆధారపడిన సాగునీటి పథకాలు వెలవెలబోతున్నాయి. పంట కాలాన్ని ముందుకు జరపాలన్న వ్యవసాయ శాఖ సూచనల మేరకు నారుమళ్లు పోసుకున్నా నాట్లు మాత్రం పడట్లేదు. బోరుబావుల్లో పుష్కలంగా నీరుందని భావించిన రైతులు మాత్రమే వరి సాగుకు ముందుకు వస్తున్నారు. జులై మాసాంతానికి నాట్లు పూర్తి చేసుకుని కళకళలాడాల్సిన తరి పొలాలు వెలవెలబోతున్నాయి. వరుణుడు కరుణించకపోతే ఈ సారి వరి సాగు గణనీయంగా పడిపోతుందని రైతులు చెబుతున్నారు.
" వానాకాలం వ్యవసాయం వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంది. జూన్‌లో సరైన వర్షపాతం లేదు. 20 నుంచి 40 శాతం వరకు లోటు వర్షపాతం ఉంది. జూన్‌లో పత్తి విత్తనాలు విత్తి నష్టపోయారు. ఇప్పుడు జులై 15వరకు విత్తనాలు విత్తుకోవచ్చు. అప్పటికి వర్షాలు అనుకూలంగా లేకపోతే కంది పంటను వేసుకోవచ్చు."- ప్రభాకర్ రెడ్డి, కేవీకే కో-ఆర్డినేటర్
Cotton Farmers Problems Due To No Rains : జిల్లాలో మొక్కజొన్న, జొన్న, ఆముదం లాంటి పంటల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. జులై నెలాఖరు వరకు పత్తి, వరి, కంది నాటుకునే అవకాశం ఉంది. సరిపడా వానలు రాకపోతే స్వల్పకాలిక, ఆరుతడి పంటలే అన్నదాతలకు దిక్కు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా 50 నుంచి 75 శాతం సాగు తగ్గించే అవకాశం ఉంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: