లాక్డౌన్ నేపథ్యంలో పెద్దఎత్తున పెళ్లిళ్లు ఆగిపోవడం వల్ల దీని ప్రభావం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ రంగాలపై పడింది. ప్రధానంగా వస్త్ర వ్యాపారం వెలవెలబోయింది. 5,470 వస్త్ర దుకాణాలు తమ వ్యాపారాన్ని పూర్తిగా వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత వివాహాల సీజనులో ఈ నెల 28వ తేదీ వరకే ముహూర్తాలు ఉన్నాయి.
ప్రభుత్వం పచ్చజెండా...
20 మంది కుటుంబసభ్యులతో పెళ్లి వేడుకలు చేసుకోవచ్చని ప్రభుత్వం పచ్చజెండా ఊపడం వల్ల మిగిలిన పది రోజుల్లో జరిగే వ్యాపారంపైనే దుకాణదారులు ఆశలు పెట్టుకున్నారు. రవాణావ్యవస్థ స్తంభించడంతో కొత్త స్టాకు రావడం లేదని, రెండు రోజులకు ఒకసారి దుకాణాలు తెరుస్తుండటం వల్ల ఆదాయం పూర్తిగా తగ్గిందని మహబూబ్‌నగర్ వస్త్ర వ్యాపారి లక్ష్మీనారాయణ తెలిపారు. అద్దెలు, కార్మికుల జీతాలు భారంగా మారాయన్నారు.
పెళ్లిళ్లు భారీగా ఆగిపోవడం వల్ల వస్త్ర వ్యాపారంతో పాటు పురోహితులు, స్వర్ణకారులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, వాద్యకారులపై తీవ్ర ప్రభావం పడింది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు ఆగిపోయి పురోహితులంతా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి నెలకొందని రాఘవేంద్రశర్మ అనే పురోహితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫంక్షన్ హాళ్లు వెలవెల...
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 950 ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. లాక్‌డౌనుతో ఇవన్నీ మూతపడి, వీటిలో పనిచేసే వంటవాళ్లు, కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. 4,300 మంది ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉన్నారు. వీరికి పెళ్లిళ్ల సీజనులోనే గిరాకీ ఉంటుంది. ఈ మూడు నెలలూ ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం వల్ల వీరంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
స్వర్ణకారుల పరిస్థితి అగమ్యగోచరం...
అదేవిధంగా స్వర్ణకారులు, బంగారు దుకాణాల యజమానులకు పెళ్లిల సమమయంలోనే ఆభరణాల లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8,250 కుటుంబాలు స్వర్ణకార వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. ‘లాక్‌డౌనుకు ముందు 10 గ్రాముల బంగారం రూ.42 వేలు ఉంది. ఇపుడు రూ.49 వేలకు చేరింది. దీంతో లాక్‌డౌనుకు ముందు ఆర్డర్లు తీసుకున్న స్వర్ణకారులు, బంగారు వర్తకులు తులం బంగారం మీద రూ.7 వేలు నష్టపోవాల్సి వస్తోంది. ఆర్థికంగా చితికిపోతున్నాం’ అని మహబూబ్‌నగర్ స్వర్ణకారుడు శేఖరాచారి ఆవేదన వ్యక్తం చేశారు.