పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ పోరు బాటపట్టింది. వచ్చేనెల 2న మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కుట్రపూరితంగానే మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు నిర్మిస్తన్నారు తప్ప.. ప్రజల ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. గ్రావిటీ కెనాల్ ద్వారా నల్గొండకు నీరందించే ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేశారన్న ఉత్తమ్... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరందించారా? అని ప్రశ్నించారు.
జీవో నంబర్ 203 ద్వారా ఏపీ ప్రభుత్వం నిర్మించదలచిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో పాలమూరుకు అన్యాయం జరిగిందన్న సంపత్.... స్వరాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్ వైఖరి వల్ల నష్టం జరుగుతోందని మండిపడ్డారు. చీకటి ఒప్పందాల వల్లే ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకోవడం లేదని ఆరోపించారు.
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వాలని కాంగ్రెస్ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే... కమీషన్ల కోసం కేసీఆర్ పునరాకృతి చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించకముందే... తెరాస ప్రభుత్వం మేల్కొనాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు నిరంజన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి... ఏపీ నిర్మించనున్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి సరికాదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు