నిరుద్యోగ జంగ్‌సైరన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్‌కు బయల్దేరిన రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రయాణంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జడ్చర్ల వద్ద (Jung Siren Tension) కాంగ్రెస్ నేతల కార్లను పోలీసులు అడ్డుకున్నారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణాల్లోకి వెళ్లొద్దని పోలీసుల ఆంక్షలు విధించారు. నేరుగా అమిస్తాపూర్ సభాస్థలికి వెళ్లాలని పోలీసుల సూచించారు. జడ్చర్ల కింది వంతెన వద్ద పోలీసుల కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అమిస్తాపూర్‌లో జంగ్‌సైరన్‌కు బయలుదేరిన రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
పైవంతెన పైనుంచి సభకు వెళ్లాలని పోలీసులు సూచించారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు... మహబూబ్‌నగర్ పట్టణంలో ర్యాలీకి అనుమతి లేదని వివరించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బారికేడ్లు తొలగించి మహబూబ్‌నగర్ వైపు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు బయల్దేరాయి. మహబూబ్‌నగర్ శివారులోనూ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బారికేడ్లు తొలగించి మహబూబ్‌నగర్‌లోకి కాంగ్రెస్ శ్రేణులు ప్రవేశించి.. పట్టణంలో ర్యాలీ చేపట్టారు.
గజమాలతో సత్కారం...
పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ సభకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి... రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో భారీ గజమాలను క్రేన్ సహాయంతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పట్టణ ముఖ్య కూడలి మీదుగా పట్టణ శివారు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడం వల్ల రోడ్డంతా కిక్కిరిసిపోయింది. రేవంత్ రెడ్డి... ప్రజలకు అభివాదం చేసుకుంటూ పాలమూరు సభకు తరలివెళ్లారు.
ఇదీ చూడండి: Huzurabad: వాడివేడిగా ఉపఎన్నిక ప్రచారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం